Fish Venkat : సినిమా ఇండస్ట్రీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు అవకాశాలు వస్తాయో.. ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంత మంది ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత తినడానికి తిండి కూడా లేని దీన పరిస్థితిలోకి పడిపోతారు.
పిష్ వెంకట్ క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశారు. హీరోల పక్కన, విలన్ ల పక్కన ఈయన లేని సినిమా లేకుండా ఉండేది కాదు. ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ తో ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో ఆయన చేసిన కామెడీ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అలాంటి ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కనీసం లేచి నడవలేని దీనావస్థలో ఉన్నారు.
ఫిష్ వెంకట్ కు షుగర్, బీపీ ఎక్కువై కాళ్లకు పుండ్లు వచ్చాయి. అవి తగ్గకపోగా.. ఇన్ ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో కాలుకు పెద్ద పుండులుగా మారి కనీసం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. కేవలం కుర్చీకే పరిమతమయ్యాడు. కాగా కిడ్నీలు కూడా పాడయ్యాయని నిమ్స్ కు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నాని ఆయన ఒక ప్రయివేట్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. చాలా ఇబ్బందిగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఒకప్పుడు ఎంతో మందికి సాయం చేశాను. కానీ నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని అన్నాడు. వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పాడు. కాగా అనారోగ్యంతో వచ్చిన సినిమాల ఆఫర్లు కూడా పోతున్నాయని ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆరోగ్య ఖర్చులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా నెటిజన్లు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రేటీలు,యాక్టర్లు ఆదుకోవాలని కోరుతున్నారు.