Supreme Court Judge : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహదేవ్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. దీంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇటీవల ఇద్దరు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో వారి స్థానంలో జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహదేవ్ లను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది. మంగళవారం (జూలై 16) వీరి నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఇద్దరిలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ఒకరిని, దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి మరొకరిని నియమించారు. మణిపూర్ నుంచి జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ తొలిసారి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్. ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ్ క్యాంపస్ లా సెంటర్ లో పూర్వ న్యాయవాద విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్ ను ప్రారంభించారు.
మరో జడ్జి జస్టిస్ మహదేవన్ తమిళనాడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు.