First Snow Fall in Newjersey : యూఎస్ లో హిమపాతం ఒక్కోసారి ఇబ్బందులు పెట్టినా..చాలా సందర్భాల్లో హిమ అందాలు కనువిందు చేస్తుంటాయి. వారం రోజుల కింద అమెరికాలోని పలు నగరాలు మంచుతుఫాన్ తో విలవిలలాడిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా దుప్పటిలా కప్పుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దట్టంగా కురిసిన మంచుతో రోడ్లు, వాహనాలు, ఇండ్లు కప్పుకపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది. న్యూయార్క్ స్టేట్ లోని పలు నగరాలు, కౌంటీలు హిమపాతంతో విలవిలలాడాయి. మంచును తొలగించేందుకు సిబ్బంది అహర్నిషలు కృషి చేశాయి. కరెంట్ సరఫరా లేక కూడా జనాలు ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత పరిస్థితి కొంత మెరుగైంది.
అమెరికా అంతటా ప్రస్తుతం భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాన గ్రేట్ లేక్స్ నుంచి దక్షిణాన టెక్సాస్ వరకు అమెరికా అంతా మంచు దుప్పటి పరుచుకుంది. అమెరికాలో మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సున్నా కంటే పడిపోయి.. మైనస్ 20డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 30 డిగ్రీలకు పడిపోయింది. బలమైన గాలులు వీస్తున్నాయి.
ఇక తాజాగా బుధవారం న్యూజెర్సీలో తొలిసారిగా హిమపాతం మొదలైంది. మంచు చిన్న చిన్నగా పడుతూ కనువిందు చేస్తోంది. మంచు తెరతెరలుగా పడుతుండడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. దీంతో అక్కడి జనాలు ఆ ప్రకృతి అందాల దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు జంటలు ‘‘హిమసీమల్లో హల్లో.. యమగా వుంది వల్లో’’ డ్యూయెట్లు కూడా వేసుకుంటున్నారు. గడ్డ కట్టించే చలిలో చెలి నెచ్చిలితో ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఇంట్లో వేడి కోసం హీటర్లు పెట్టుకుంటే.. ఒంట్లో హీట్ కోసం ఉలెన్ స్వెట్లర్లు, మందు చుక్కను ఆశ్రయిస్తున్నారు. కొందరు న్యూజెర్సీ మంచు అందాలను ఇంట్లోనే కిటీకిల్లో నుంచి చూస్తూ ఉప్పొంగుకుంటూ వచ్చే కవీత్వాన్ని తమ తమ భాషల్లో బయటకు తీస్తున్నారు.
అమెరికాలో హిమపాతం కొందరిని ఆహ్లాదంలో ముంచుతుంటే మరికొందరిని మాత్రం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. భారత్ లో మనం మాత్రం కొద్దిగా చలి ఎక్కువైతేనే తెల్లారి తొమ్మిదింటి దాక ముసుగు తన్ని పడుకుంటాం. పాపం అమెరికన్లు నిత్యం హిమధాటిని ఎలా భరిస్తున్నారో కదా.. అని కొందరు.. అక్కడికి వెళ్లి మంచు అందాల్లో ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటున్నారు.