JAISW News Telugu

Yashasvi Jaiswal : టెస్టు కెరీర్ లోనే తొలి డబుల్ సెంచరీ.. యశస్వి పట్టుదల వెనుక కారణం అదే!

First double century in Test career

First double century in Test career

Yashasvi Jaiswal : యశస్వి అదరగొట్టాడు..తోటి బ్యాటర్లు టపాటపా వికెట్లు పారేసుకుంటూ వెనుదిరిగి వెళ్తున్నా..కసితో ఆడి దుమ్మురేపాడు. టెస్టు కెరీర్ లోనే తొలి డబుల్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. పిచ్ పరిస్థితులకు అలవాటుపడి, సవాల్ కు అడ్డుగా నిలిచి..భారీ ఇన్నింగ్స్ తో అబ్బురపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనదైన శైలిలో షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు.

విశాఖ పట్టణంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ ను చీల్చి చెండాడి 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. తన టెస్ట్ కెరీర్ లో జైస్వాల్ కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈక్రమంలో పలు రికార్డులు నమోదు చేశాడు. టీమిండియా తరపున డబుల్ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడు జైస్వాలే. అతడి వయస్సు ప్రస్తుతం 22 ఏండ్లే కావడం విశేషం.

యశస్వి  176 పరుగుల వద్ద నేడు రెండో రోజు ఆటకు దిగాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు.  191 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన తెగువ ప్రదర్శించాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో సిక్సర్ బాదాడు. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నా ఔట్ అవుతాననే భయం లేకుండా కొట్టడం అందరినీ అబ్బురపరిచింది. ఆ తర్వాతి బంతికే ఫోర్ బాదాడు. దీంతో డబుల్ సెంచరీకి చేరుకున్నాడు. అనంతరం గాల్లోకి ఎగిరి సెలెబ్రేట్ చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ కు, ఆడియన్స్ కు అభివాదం చేశాడు. ఇక ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో 209 పరుగులకు (290) బంతుల్లో ఔటయ్యాడు.

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తోటి బ్యాటర్లు సరిగ్గా నిలదొక్కుకోకుండా టపాటపా రాలిపోతున్నా..యశస్వి చూపిన తెగువ అందరినీ అలరించింది. అయితే భారత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం అంతా ఈజీ కాదు. యువ ఆటగాళ్లతో విపరీతమైన పోటీ ఉంటుంది. టెస్ట్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే అద్భుతంగా ఆడాల్సిందే. అలాగే టెస్ట్ జట్టు ఓపెనర్ స్థానం పర్మినెంట్ చేసుకోవాలంటే ఆ మాత్రం తెగువ చూపాల్సిందే. శుభమన్ గిల్ లాంటి వారితో ఓపెనర్ స్థానం కోసం పోటీపడాల్సి ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాలను వదులుకోవద్దనే వైఖరి యశస్విలో కనిపించింది. అందుకే ఇంగ్లాండ్ బౌలర్ల దాడికి ఏమాత్రం జంకుగొంకు లేకుండా ఉతికి ఆరేశాడు. వన్డేల్లో బ్యాటింగ్ చేసినట్టుగా తన బ్యాట్ కు పనిచెప్పాడు. యశస్వి అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే హవాను కొనసాగిస్తే యువకుడైన యశస్వికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పక తప్పదు.

Exit mobile version