First Day Nominations : తొలి రోజే నామినేషన్ల వెల్లువ..దాఖలు చేసింది వీళ్లే..
First Day Nominations : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ఇవ్వాళే మొదలైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇక లోక్ సభ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్లు దాఖలు చేశారు.
మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్ వేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మెదక్ కలెక్టరేట్ వద్దకు ఆయన భారీ ర్యాలీతో వెళ్లారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరో వైపు మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.
శామీర్ పేట నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కు ఈటల కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టరేట్ లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈటల రాజేందర్, ఆయన సతీమణి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హరదీప్ సింగ్ పురీ, కిషన్ రెడ్డి హాజరయ్యారు. నామినేషన్ వేసిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ప్రత్యేక వాతావరణంలో జరుగుతున్నాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో 50 రోజులుగా ప్రజల అభిప్రాయాలు వింటున్నామని, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. మోదీ ఉంటేనే దేశం అభివృద్ధి వైపు మరింతగా దూసుకెళ్తుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోదీ పాలనలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని ఈటల వివరించారు.
మోదీ పాలన వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం పెరిగిందని చెబుతున్నారని, కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను ప్రధాని కాపాడారని ఈటల రాజేందర్ తెలిపారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలు తమ వెంటే ఉన్నారని ఈటల చెప్పారు. కేసీఆర్, రేవంత్ డబ్బు సంచులతో నాయకుల తలలకు వెల కట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. మినీ ఇండియాగా మల్కాజిగిరికి మారుపేరు ఉందని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.