Avadhana Murari : తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీఏఎల్) ఆధ్వర్యంలో త్రి భాషా మహా సహస్రావధాని, ఏలూరు శ్రీ ప్రణవ పీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 20వ శతావధానం 2024, జూలై 13న లండన్ నగరంలో జరిగింది. ఇది యూరప్ ఖండంలోనే తొలి శతావధానంగా కీర్తి కెక్కింది. తెలుగు సాహితీ సంస్థ అయిన టీఏఎల్ ఈ శతావధానాన్ని భారీ వేడుకగా నిర్వహించారు.
25 సమస్యలు, 25 వర్ణనలు, 25 దత్తపదులు, 25 ఆశువులు, అప్రస్తుత ప్రసంగంతో ఆద్యంతం హృద్యంగా సాగింది. శతావధానం మొత్తం ఒకేరోజులో అంటే కేవలం 5 గంటల 30 నిమిషాలలో పూర్తి చేయడం సాహితీ చరిత్రలో ముఖ్యంగా విదేశాల్లో రికార్డేనని తాల్ సంస్థ అభివర్ణించింది. సభికులు సంధించిన ప్రశ్నలకు అవధాని వద్దిపర్తి పద్మాకర్ పద్య రూపకంలో పూరిస్తుంటే ఆ వేగం లేఖకుల కలాలకు అందుకోలేకపోయింది. సమస్య, దత్తపది, వర్ణనను కూడా ఆశువుగా కొత్త, కొత్త తెలుగు పదాలతో అవధాని పూరిస్తుంటే.. ప్రత్యక్ష పరోక్ష వీక్షకులను ప్రతీ పద్యం ఆణిముత్యంలా, సాహితీబోధలా, మధురమైన సాహితీ విందులా అనిపించింది.
వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లతో పాటు విద్యార్థులు సభకు హాజరై తెలుగు భాషలోని వెలుగులను చెవితో, కంటితో పరికించారు. లండన్ లో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న టీఏఎల్ ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని ప్రవాసులు తెలిపారు. ఇందులో వద్దిపర్తి పద్మాకర్ కు ‘అవధాన మురారి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించుకున్నారు. తమ సంస్థకు దక్కిన అరుదైన, అపురూప అవకాశంగా భావిస్తున్నామని టీఏఎల్ నిర్వాహకులు తెలిపారు.
కల్చర్ ట్రస్టీ శ్రీదేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన చైర్మన్ రవి సబ్బ, ట్రస్టీలు అశోక్ మాడిశెట్టి, వెంకట్ నీల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పెట, రవి మోచెర్ల, కార్యకర్తలు శుభారాణి, శ్రీవల్లి జయసింహ, కృష్ణ కిషోర్, కళ్యాణ్, మురళి కోట, షర్మిల, కృష్ణ పాలకొల్లు, నాగేంద్ర, సుధ చద, రాయ్ బొప్పన, వెంకటేశ్వరరావు, సుధ బోలిశెట్టికి ధన్యవాదాలు తెలిపారు. కోర్ మెంబెర్స్ బాలాజీ కల్లూరు, కిషోర్ కస్తూరి, సూర్య కందుకూరి, శ్రీధర్ మేడిచెట్టి కార్యక్రమానికి హాజరయ్యారు.