Covid 19 Subvariant JN.1:కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. లక్షల్లో జనాలని పొట్టనబెట్టుకుంది. కొంత కాలంగా వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రజలను భాయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కొత్తగా సబ్‌వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదవుతున్నాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లంక్సెంబర్గ్‌లో గుర్తించారు.
ఆ తరువాత ఇదే తరహా కేసులను యూకె, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా సబ్‌వేరియంట్ జెఎన్.1 కేసులు భారత్‌లోనూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా సబ్‌వేరియంట్ జెఎన్.1 కేసు కేరళలో నిర్థారణ అయింది. దీంతో కేరళ వైద్య శాఖలో మరో సారి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జెఎన్.1 కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్‌కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్, ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ 2.86 వంశానికి చెందినది. దీనిని `పిరోలా` అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం జెఎన్.1, బీఏ 2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్ మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
జేఎన్.1 లక్షణాలు…
సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్ వేరియంట్ నిర్ధిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో దాని లక్షణాలు కోవిడ్ -19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చు అంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం జేఎన్.1కు సంబంధించి ఎలాంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుంచి సులభంగా తప్పించుకోగలదని చెబుతున్నారు. ఇతర కరోనా వేరియంట్‌ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు.