Fire accident:ఆస్పత్రుల్లో ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా అగ్ని ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో రోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సహాయంతో రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కొంతమంది మంటల్లో చిక్కుకోవటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని నగర సీపీ తెలిపారు. ఆస్పత్రి అంతా దట్టమైన పొగ కమ్ముకోవటంతో సహాయ చర్యలకు ఆటకం కలుగుతోంది. తీవ్రంగా శ్రమించి చాలామందిని బయటకు తీసుకొచ్చారు.
ఈ ఘటనతో రోగులు భయంతో బయటకు పరుగులు తీయగా..రోగులు..వారి బంధువులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఇండస్ ఆస్పత్రిలో మొత్తం 150 పడకలు ఉండగా..46మంది ఇన్ పేషెంట్లుగా ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.