Food Grains : చివరకు ఆహార ధాన్యాలూ దిగుమతి..వ్యవసాయ దేశానికి ఎందుకీ దుస్థితి?
Food Grains : భారత్ పెద్ద వ్యవసాయ దేశం..ఇక్కడి ప్రజల్లో దాదాపు 60 శాతం మంది వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనే ఆధారపడుతారు. దేశంలో ఉన్న లక్షల గ్రామాల ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అయినా మన ఆహార ధాన్యాలు మనకు సరిపోవడం లేదు. అతిపెద్ద వ్యవసాయ దేశంగా కొలువబడుతున్న దేశానికి ఈ దుర్గతి ఎందుకు? అని చాలా మందికి అనుమానం రావొచ్చు. ఆయుధాలే కాదు చివరకూ ఆహార ధాన్యాలను కూడా దిగుమతి చేసుకోవాలా? అని నేటి తరం అడుగుతోంది.
1970 దశకం దాక మన దేశం పెద్ద ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకునేది. నేడు పప్పులు, నూనెలు అదే తరహాలో దిగుమతి చేసుకుంటోంది. పప్పులు, నూనెల కొరత, దిగుమతుల వలన వాటి ధరలు నిరంతం పెరుగుతూ సామాన్యుల కుటుంబాలను ఆర్థికంగా సంక్షోభంలోకి నెడుతున్నాయి. నాలుగైదు సంవత్సరాల కింద కిలోకు రూ.60-70లకు లభించిన కందిపప్పు నేడు 180 రూపాయలకు చేరింది. మారుమూల ప్రాంతాల్లో 200లకు అమ్ముతున్నారు. ఇక పెసరపప్పు కిలో రూ.100-120, మినప్పప్పు రూ.80-120, మేలురకమైతే రూ.160దాక పలుకుతోంది. శనగ పప్పు 70-100కు చేరుకున్నది.
ఇలా పప్పుల ధరలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం సాగు తగ్గడం. ఇప్పటి వరకు దేశంలో కంది సాగు 40.20 లక్షల ఎకరాలుగా ఉంటే, అందులో 11శాతం కంటే ఎక్కువగా సాగు విస్తీర్ణత తగ్గింది. ఏపీలో 12లక్షల ఎకరాలు, తెలంగాణలో 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. దేశ స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో సాగు తగ్గడానికి కారణం సరైన మద్దతు ధర అందకపోవడమే. దీంతో రైతులు ఈ పంటలను పండించక మద్దతు ధరలు ప్రకటించే వరి వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వార్షిక పప్పు ధాన్యాల వినియోగంలో 15శాతం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది.
అలాగే వంట నూనెల పరిస్థితి కూడా. వంట నూనెల ఉత్పత్తిలో దేశం చాలా వెనకబడి ఉంది. అవసరమైన వినియోగంలో 56 శాతం నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవికాక ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల కొనుగోలుదారుగా కూడా భారత్ ఉంది. మన దేశం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడడం వల్ల ప్రపంచ మార్కెట్ ను బట్టి మన దగ్గర ధరలు పెరగడం, తగ్గడం వంటివి సంభవిస్తున్నాయి.
ఇలాంటి దుస్థితి రావడానికి కారణం ప్రభుత్వాలు రైతులను సరిగ్గా పట్టించుకోకపోవడమే. 140 కోట్ల జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను పండించుకునేందుకు తగిన ప్రణాళిక లేకపోవడం, పప్పులు, నూనె పంటలకు సరైన మద్దతు ధరలు ప్రకటించకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. ఇప్పటికైనా దేశ ప్రయోజనాలకు అనుకూలమైన వ్యవసాయ విధానలు అమలు చేయాల్సి ఉంది. పంటల విస్తీర్ణం పెంచి దిగుమతులు తగ్గించాలి. అప్పుడే పప్పులు, నూనెల ధరలు తగ్గుతాయి.