TPCC chief Mahesh Kumar Goud : సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

TPCC chief Mahesh Kumar Goud
TPCC chief Mahesh Kumar Goud : సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల గురించి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అవి తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలని, వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై మీడియాతో చెప్పడంతో పాటు ఎక్స్ వేదికగా కూడ మంత్రి పోస్టు పెట్టారని తెలిపారు. అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు.
మహిళల పట్ల కేటీఆర్ చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడం తప్పితే.. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇరువైపులా కూడా మహిళలు ఉన్న విషయాన్ని సినీ ప్రముఖులు గుర్తించాలని కోరారు.
‘‘మంత్రి సురేఖపై కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోస్టులు పెట్టారు. ఓ సోదరుడిగా ఓ సోదరికి నూలుపోగు దండ వేసిన విధానాన్ని ట్రోల్ చేశారు. దీన్ని సినీ ప్రముఖులు కూడా చూసి ఉండొచ్చు. దీంతో ఆ మహిళ ఎంత బాధపడ్డారో ఓసారి అర్థం చేసుకోవాలి. బేషరతుగా మంత్రి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.