Lok Sabha Elections : గత బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పిదాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా నీటిపారుదల శాఖలో అవినీతి జరిగిందనే సంఘటనలకు సాక్ష్యాలు కూడా లభిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి వారిని జైలుకు పంపించేందుకు కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గొర్రెల పంపిణీలో కూడా పలు అక్రమాలు జరిగినట్లు చెబుతున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లు తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో మంత్రి తలసాని శ్రీనివాస్ కు సీఎస్ గా వ్యవహరించిన కల్యాణ్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసేందుకు సమాయత్తమైనట్లు చెబుతున్నారు. దీంతో మంత్రుల్లో అప్పుడే భయం పట్టుకుంది.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. రూ. 55 కోట్లు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన కేసులో అతడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై అతడు చెప్పే సమాధానాలు కరెక్టుగా లేవు. తాను మంత్రి కేటీఆర్ సూచించినట్లు చేశానని, తనకేమీ సంబంధం లేదని చెబుతుండటంతో ఆ డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబడుతున్నారు.
భూ కబ్జా కేసులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా ఎఫ్ ఐఆర్ నమోదు కావడం గమనార్హం. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవినీతి చోటుచేసుకున్నట్లు తేలింది. దీనిపై కాంగ్రెస్ న్యాయపరంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తదుపరి చర్యలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొందరిని అరెస్టు చేసేందుకు కూడా మార్గాలు అన్వేషిస్తోంది. లోక్ సభ ఎన్నికల వరకు వేచిచూసి తరువాత వారిపై చర్యలకు ఉపక్రమించడం ఖాయంగా కనిపిస్తోంది.