Bengaluru : పీయూసీ ఫలితాల విషయంలో తల్లీ కూతుళ్ల మధ్య మొదలైన గొడవ హత్యకు దారి తీసింది. ఈ దారుణ ఘటన బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో శాస్త్రి నగర్‌లో సోమవారం (ఏప్రిల్ 29) రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పద్మ, సాహితీ (18) తల్లీ కూతుళ్లు.. పద్మ భర్త కొంత కాలం క్రితం మృతిచెందడంతో పద్మ కూతురు సాహితితో కలిసి ఉంటోంది.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం పీయూసీ ఫలితాలు విడుదల చేసింది. ఈ రిజల్ట్ లో సాహితీ పాసైనా తక్కువ స్కోర్ చేసిందని తల్లి పద్మకు సంతృప్తి కలగలేదు. ఈ విషయమై తల్లీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ రాత్రి 7.30 గంటల సమయంలో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కూతురు తన తల్లి పద్మను కత్తితో నాలుగు చోట్ల పొడించింది. తల్లి కూతురి మెడపై, కడుపుపై మూడుసార్లు కత్తితో పొడిచింది. దీంతో కూతురు అక్కడికక్కడే మరణించింది. ఇంటి నుంచి పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, సాహితీ మృతి చెందినట్లు ప్రకటించారు. తల్లి పద్మ చికిత్స పొందుతోంది. ‘ప్రాథమిక విచారణ ప్రకారం, ఇద్దరు మాత్రమే ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి కోలుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలుస్తాయి’ అని పోలీసులు తెలిపారు. బనశంకరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.