Jharkhand CM : భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపా సోరెన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుని 7గంటలకు పైగా ప్రశ్నించి, ఆతర్వాత ఆయనను అరెస్ట్ చేసింది.
హేమంత్ అరెస్ట్ ఖాయమని తెలిసే ముందుగానే హేమంత్ భార్యను కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రిగా చేస్తారనే టాక్ వినిపించింది. అయితే దీనిపై సోరెన్ కుటుంబంలో విభేదాలు తలెత్తడంతో.. చివరకు పార్టీ సీనియర్ నేత చంపా సోరెన్ ను సీఎంగా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కల్పనా సోరెన్ సీఎంగా చేయడానికి తోటి కోడలు సీతా సోరెన్ ఒప్పుకోనట్టు సమాచారం. ఇంటి పోరుతో కల్పనా సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది.
అయితే చంపా సోరెన్ కూడా బలమైన నేతనే. ఆయనను జార్ఖండ్ ప్రజలు ‘జార్ఖండ్ టైగర్’ గా పిలుచుకుంటారు. ఈయన హేమంత్ సోరెన్ కు దగ్గరి బంధువు. అత్యంత సన్నిహితుడు. అలాగే ఆయన రవాణా మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన సెరైకెలా అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిహార్ నుంచి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపా పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్ తో పాటు చంపాపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచే ఆయనకు ‘జార్ఖండ్ టైగర్’ అనే పిలుస్తున్నారు.
చంపా సోరెన్ 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. 2010 నుంచి 2013వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా పనిచేశారు. 2014, 2019లోనూ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రవాణా, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.