NOTA : నచ్చితే పార్టీలకు, పార్టీలు నచ్చకుంటే అభ్యర్థులకు.. అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేయవచ్చు. సుప్రీంకోర్టు 2013, సెప్టెంబర్ 27న దీనిపై రూలింగ్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి నోటా అమల్లో ఉంది. ఓటరు తప్పకుండా పోలింగ్ బూతుకు తీసుకచ్చేందుకు ఇది చాలా వరకు ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. అయితే ఎక్కడయితే నోటాకు ఎక్కువ ఓట్లు పడతాయో అక్కడ రీ పోలింగ్ ఉంటుంది.
నోటా అమలైనప్పటి నుంచి అభ్యర్థులు సతమతం అవుతూనే ఉన్నారు. గతంలో ఎవరో ఒకరు భారీ మెజారిటీతో గెలిచేవారు. దీంతో కాలర్ ఎగరేసుకొని తిరిగే వారు. కానీ నోటా వచ్చిన తర్వాత అత్తెసరు మెజారిటీతో బయటపడుతుండడంతో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం పక్కన పెట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటా ఇబ్బందులు పెట్టేలా ఉందని పలువురు అభ్యర్థులు కలవరపడుతున్నారు.
తాము భారీ మెజారిటీతో గెలుస్తామని కొందరు అభ్యర్థులు అనుకున్నప్పటికీ నోటా వారిని కలవరపెడుతున్నదట. స్వల్ప తేడాతో బయటపడతాం కావచ్చని ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారు. నోటా ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్నికల ఫలితాల కోసం అందరూ జూన్ 4వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల విజయావకాశాలపై అంచనాలు వేస్తున్నాయి. పోలింగ్ సరళిని విశ్లేషించి తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఎన్నికల ఫలితాలపై నోటా ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అత్యంత సమర్థుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది. అభ్యర్థులు ఎవరూ ఇష్టం లేకపోతే ఓటర్లు నోటాను ఎంచుకోవచ్చు.
2014 ఎన్నికల్లో నోటా ఓట్లు పెద్దగా లేకపోయినా గత ఎన్నికల్లో గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో నోటా ఓట్లు మళ్లీ పెరిగితే అది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ఉదాహరణకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నోటా ఓట్లు 2014లో 14,457 ఉండగా, 2019లో 48,621కి పెరిగాయి. గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత వల్ల చాలా మంది తెలియకుండానే నోటాకు ఓటేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
అరకులో 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు అత్యధికంగా వచ్చాయి. నోటా ఓట్లు పెరగడం వల్ల తమ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
కొన్ని నియోజకవర్గాల్లో నోటా ఓట్ల సంఖ్య కంటే గెలుపు ఓటముల ఓట్ల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. ఉదాహరణకు చోడవరం నియోజకవర్గంలో 2014లో గెలిచిన అభ్యర్థికి నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఎన్నికల ఫలితాలే మారిపోయే అవకాశం ఉంది.