Telangana : రైతు రాజకీయం మొదలైంది.. వెనకపడిపోతున్న ఆ పార్టీ..

Telangana

Telangana

Telangana : తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అయితే.. కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వ పటిమకు పెద్ద పరీక్ష. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే తాము 14 సీట్లు గెలవబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే బీజేపీ, బీఆర్ఎస్ రైతు రాజకీయం మొదలుపెట్టేశాయి.

రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. సరిగ్గా దీన్నే ఆసరాగా తీసుకుని కేసీఆర్ రాజకీయం మొదలుపెట్టారు. కృష్ణా నదీ జలాల పంపకం మీద రాజకీయం చేయాలనుకున్నా అది వర్కవుట్ కాలేదు. అందుకే ఒకే సభ పెట్టి సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లు తయారయ్యాయి. కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తుందా అన్న అనుమానాలున్న సమయంలో కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.

పైగా పార్టీ నుంచి సీనియర్లు కేకే, కడియం వంటి వారు కూడా వెళ్లిపోతున్న నేపథ్యంలో.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే లీడర్లు సైతం మానసికంగా భయపడుతున్నారు. క్యాడర్ కూడా గందరగోళంగా ఉంది. దీంతో క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా కేసీఆర్ గ్రౌండ్ కు వెళ్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే నల్గొండలో రైతు పరామర్శ యాత్ర చేసిన కేసీఆర్ వారం రెస్ట్ తీసుకుని ఏప్రిల్ 5న కరీంనగర్ లో పర్యటించాలని భావిస్తున్నారు.

ఎన్నికలు వస్తున్న తరుణంలో తానేక్కడ వెనకపడిపోతానన్న భయంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతుదీక్షకు రెడీ అయ్యారు. కేసీఆర్ వచ్చే లోపే తాను దీక్షకు దిగుతున్నారు. కలెక్టరేట్ వద్ద రైతు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఓట్ల వేటలో వెనకపడొద్దన్నదే బండి దీక్షలోని అసలు విషయం అనేది ఓపెన్ సీక్రెట్. అయితే బీఆర్ఎస్, బీజేపీ రైతుల పేరుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ సైలెంట్ గా ఉండడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ వాగ్దాటికి, బండి సంజయ్ అటాకింగ్ కు తగ్గట్టుగా కాంగ్రెస్ నుంచి కౌంటర్ పడలేదని.. ఇదే కంటిన్యూ అయితే కాంగ్రెస్ సైడ్ అయిపోవడం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

TAGS