BJP Manifesto : బీజేపీ మ్యానిఫెస్టోపై రైతుల పెదవివిరుపు.. వర్కౌట్ కానట్లేనా..?
BJP Manifesto : తెలంగాణలో అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోలు ప్రకటించాయి. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఈ మ్యానిఫెస్టోలో రూపొందించారు. ముందుగా బీఆర్ఎస్ ఈ మ్యానిఫెస్టో విడుదల చేయగా, ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ లు వీటిని విడుదల చేశాయి. అయితే ఒక పార్టీకి మించి మరో పార్టీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఉచితాల పేరిట మరోసారి ప్రజల ఓట్లను గెలుచుకునే ప్రయత్నం చేశాయి. ఏదేమైనా ఈ సారి తెలంగాణలో హామీల వర్షం కురిసింది. గతంలో ఏ పార్టీ చూసుకున్నా మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు పూర్తి స్థాయిలో ఆచరణలో చూపిన దాఖలాలు లేవు. అయితే ఇందులో బీఆర్ఎస్ కొంత మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నది.
అయితే తాజాగా బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై రైతులు పెదవి విరుస్తున్నారు. రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు ఒకే రకంగా హామీని గుమ్మరించాయి. ఇన్నాళ్లు ఎకరాకు ఏడాదికి ఇచ్చే రూ. 10 వేలను ఇకపై విడుతల వారీగా పెంచి రూ. 16 వేలు చేస్తామని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా చెప్పింది. ఇప్పటికే తాము ఏడాదికి రూ. 24 వేలు ఇస్తున్నట్లు చెప్పుకున్నది. ఇప్పటికే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ. 6 వేలు ఇస్తుండగా, డీఎపీ, యూరియాలకు సబ్సిడీని కూడా ఇందులో యాడ్ చేసింది. దీంతో ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 24 వేలు ఇస్తున్నదని చెప్పుకునే ప్రయత్నం చేసింది.
సాగుకు వాడే 45 కేజీల యూరియా బస్తా అసలు ధర రూ. 2503 కాగా, రైతు చెల్లించే ధర రూ. 263 కాగా కేంద్రం సబ్సీడీ రూ. 2236 సబ్సిడీ భరిస్తున్నదని చెప్పారు. 50 కేజీల డీఏపీ అసలు ధర రూ. 3771 కాగా, రైతు చెల్లించేది కేవలం రూ 1311 మాత్రమే, కేంద్రం భరిస్తున్నది రూ. 2422 అని చెప్పారు. ఒక ఏడాది కి నాలుగు యూరియా, డీఏపీ బస్తాలు ఎకరాకు అవసరమైతే, ఇలా చెప్పుకుంటే రూ. 18632 భరిస్తున్నదని చెప్పారు. ఇలా కేంద్రం రూ. 24632 భరిస్తున్నదని చెప్పారు. అయితే సబ్సిడీ భరించడమనేది కేంద్రం బాధ్యత. దీనిని కూడా బీజేపీ నేతలు మ్యానిఫెస్టోలో చెప్పుకోవడం ఇప్పుడు రైతులను విస్తుపోయేలా చేసింది. దీనిపై రైతులంతా పెదవి విరుస్తున్నారు.