Farmer suicide : రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య

Farmer suicide
Farmer suicide : రుణమాఫీ కాలేదని, ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ధరావతు తండాలో జరిగింది. తండాకు చెందిన ధరావతు రవి (53) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు, రుణమాఫీ కాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ తండాలో విషాదం నెలకొంది.
రోజూలానే ఆదివారం రవి పొలానికి వెళ్లాడు. కానీ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య, భర్తను వెతుక్కుంటూ వెళ్లింది. ఆమెకు గుండెలు బరువెక్కే దృశ్యం కనిపించింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు తన భర్త. కేకలు వేస్తూ వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి, అతని భార్య పేరిట బ్యాంకులో రూ.2,46,000 రుణం ఉంది. అది మాఫీ కాకపోవడంతో పాటు ఇతర అప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండావాసులు తెలిపారు.