JAISW News Telugu

Jagan Vs Sharmila : కడప ఎన్నికల్లో ఫ్యామిలీ వార్..అన్నా, చెల్లెళ్ల పోరు ఖాయం?

Family war in Kadapa elections

Family war in Kadapa elections

Jagan Vs Sharmila : షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే కుటుంబ పోరు తప్పదని ఆమెకు తెలుసు. అధికారంలో ఉన్న సొంత అన్నతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంటుందని తెలుసు. ఇవన్నీ తెలిసే షర్మిల అన్నింటికీ సిద్ధమైపోయారు. అందుకే ఆమె ఏ మొహమాటం లేకుండా రాజకీయాల్లో తన సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ తీరుపై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. బంధాలు బంధాలే..రాజకీయాలు రాజకీయాలే అన్నట్లుగా ఆమె దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. అందుకే ఏ సంకోచం, భయం లేకుండా పోరుకు సిద్ధమైపోయారు.

ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఏ క్షణమైనా రావొచ్చు. నోటిఫికేషన్ వస్తే తొలి విడతలోనే ఏపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే నిండా రెండు నెలల సమయం కూడా ఉండబోదు. ఈలోపు కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేయడం, తన సత్తా చాటడం షర్మిల రాజకీయ భవిష్యత్ కు చాలా అవసరం. ఇక రాజకీయాల్లో గట్టి పట్టు సాధించాలంటే కడప రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలి. ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఎంత రాజకీయం చేసినా వృథానే. ఈ విషయం ఆమెకు స్పష్టంగా తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మరో సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు షర్మిల భావిస్తున్నారు. తండ్రిని హత్య చేసిన వారిపై అలుపెరుగని పోరు చేస్తున్న సునీత..ఇక రాజకీయాల్లోనూ తేల్చుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. సునీత  డాక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆమె రాజకీయాలు కాదు కదా కనీసం మీడియా ముందుకు కూడా ఎన్నడూ రాలేదు. కానీ తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని అసామాన్య పోరు సాగిస్తున్నారు. వైఎస్ కుటుంబంలో కూడా ఆమెకు మద్దతు ఉండడంతో ఇక రాజకీయాల్లోనూ అడుగుపెట్టాలని భావిస్తున్నారు. తండ్రి, పెద్దనాన్న పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. షర్మిల, సునీత పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వైఎస్ సునీత, షర్మిల.. కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగితే కడప జిల్లాలో ఫ్యామిలీ వార్ ఉన్నట్టే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అప్పట్లో పులివెందుల ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పట్లో ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. కుటుంబం కూడా వైఎస్ జగన్ వెంట ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఈక్రమంలో పులివెందులలో అన్నా, చెల్లెళ్లు రాజకీయ ప్రత్యర్థులుగా బరిలో దిగే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే జరిగితే రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయనడంలో సందేహం లేదు.

Exit mobile version