Extra Ordinary Man Review:ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రివ్యూ
Extra Ordinary Man Review:నటీనటులు:నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్‌రాజ్, బ్రహ్మాజీ, తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ:ఆర్ధర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్
ఎడిటింగ్:ప్రవీణ్ పూడి
సంగీతం:హరీష్ జయరాజ్
నిర్మాతలు:సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి
కొంత కాలంగా హీరో నితిన్‌కు సరైన హిట్‌లేదు. `భీష్మ`తో సక్సెస్ లభించినా దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఈ సినిమా తరువాత నితిన్ చేసిన `రంగ్ దే`, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు నితిన్‌కు తీవ్ర నిరాశను కలిగించాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ సారి సక్సెస్‌ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో నితిన్ చేసిన సినిమా `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్`. బన్నీతో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` మూవీని రూపొందించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్, డా. రాజశేఖర్ కీలక పాత్రలో నటించడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి శుక్రవారం విడుదలైన ఈ సినిమా నితిన్‌కు విజయాన్ని అందించిందా?..ఆశించినట్టుగానే ప్రేక్షకుల్ని మెప్పించిందా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథేంటీ?:
అభి అలియాస్ అభయ్ (నితిన్)కు చిన్నతనం నుంచి మరో వ్యక్తిలా ఉండటం అంటే ఇష్టం. అదే అతన్ని జూనియర్ ఆర్టిస్ట్‌గా మారేలా చేస్తుంది. కానీ తనకు ఎంత ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కదు. షూటింగ్స్‌లో దర్శకులెప్పుడూ అభిని కెమెరా కంటికి కనిపించనంత దూరంలో నిలబెట్టాలని చూస్తుంటారు. అలా సాగిపోతున్న అభి జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ఎంట్రీ ఇస్తుంది. తను ఓ పెద్ద కంపనీకి సీఈఓ. తనతో ప్రేమలో పడ్డాక అభి లైఫ్ మారిపోతుంది. అదే ఆఫీస్‌లో అభి సీఈఓ స్థాయికి చేరుకుంటాడు. అదే సమయంలో అతనికి హీరోగా నటించే అవకాశం వస్తుంది.
ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కోటియా గ్రామంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అది. అందులోని రావణుడు లాంటి నీరో అలియాస్ నిరంజన్ (సుదేవ్ నాయర్) అనే ప్రతినాయకుడి ఆటకట్టించడానికి సైతాన్ అనే పోలీస్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలకాంశం. ఈ కథ అభికి విపరీతంగా నచ్చడంతో ముందు సినిమా చేయకూడదనుకున్నా ఆ తరువాత మనసు మార్చుకుంటాడు. ఆ సినిమా కోసం ఉద్యోగాన్ని, ప్రేమించిన అమ్మాయిని వదులుకుని కష్టపడతాడు. కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి దర్శకుడు అభిని కాదని మరో హీరోతో ఆ చిత్రం పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అభికి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అదేంటీ? ఇంతకీ ఏం జరిగింది? …అభి దొంగ పోలీస్‌గా కోటియాకు వెళ్లి ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
జూనియర్ ఆర్టిస్ట్ అభిగా నితిన్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించారు. భిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లిఖిత పాత్రలో శ్రీలీల అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇందులో డా. రాజశేఖర్ ఐజీగా కీలక పాత్ర పోషించారు. తెరపై ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకుల్లో మంచి జోష్ నింపుతుంది. ప్రతినాయకుడు నీరో పాత్రలో మలయాళ నటుడు సుదేవ్ నాయర్ భీకరమైన లుక్స్‌తో కనిపించారు. హీరో తండ్రిగా రావు రమేష్ తనదైన మేనరిజమ్‌లతో ఆద్యంతం నవ్వులు పూయించారు. రోహిణి, బ్రహ్మాజీ, ఆది, సత్యశ్రీ తదితరులు పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల తీరు:
నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే దర్శకుడు వక్కంతం వంశీ కామెడీపై పెట్టినంత శ్రద్ధ కథపై అసలు పెట్టలేకపోయారు. సినిమాని ఆరంభించిన తీరుకు.. ముగించిన విధానానికి సంబంధం లేదు. ప్రధమార్థంలో కథలేకున్నా బాగానే కాలక్షేపాన్నిస్తుంది. ద్వితీయార్థం మాత్రం రొటీన్ ఫార్మాట్‌లో సాగుతుంది. పతాక సన్నివేశాలు ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. హరీష్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు రెండు బాగున్నాయి. కానీ నేపథ్య సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా ఉంది. సినిమాలో ఎడిట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ద్వితీయార్థంలో 20 నిమిషాలు కట్ చేస్తే మరోలా ఉండేది.
ఎలా ఉందంటే?:
ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కించిన సినిమా ఇది. అందుకేనేమో కథలో లాజిక్కులని పక్కన పెట్టి కామెడీ ట్రాక్‌లను వరుసగా పెంచుకుంటూ పేర్చుకుంటూ వెళ్లారు దర్శకుడు వక్కంతం వంశీ. అయితే ఆ ట్రాక్‌లని ఎంత వినోదభరితంగా రూపొందించినా వాటిని కథలో సహజంగా ఇమడ్చలేనప్పుడు ఆ ప్రయత్నమంతా వృధా ప్రయాసే అవుతుంది. దానికి ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి కథలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. అయితే తెలిసిన కథకే కొన్ని ట్విస్ట్‌లు జోడించి కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అది కొంత వరకు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసినా చూస్తున్నాకొద్దీ ప్రేక్షకుడిని నిరుత్సాహానికి గురి చేస్తుంది. విలన్‌కు కథ చెబుతున్న సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా సాగినా మధ్యలో ప్రేమకథ ఎంటర్ అయ్యేసరికి నీరసం ఆవహించింది. ద్వితీయార్థంలో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలనే తాపత్రయంతో అసలు కథను కంగాళి చేశారు. దీంతో సినిమా దారి తప్పింది. నేల విడిచి సాము చేసినట్టు కథను వీడి సాము చేయడమే ఈ సినిమాకు ఎక్స్‌ట్రా అయింది.
పంచ్ లైన్:నో ఎక్స్‌ట్రార్డనరీ కానీ..
రేటింగ్:2.75