CM Revanth : డిసెంబర్ లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పదవులను పెండింగ్ లో పెట్టారు. ఇక జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు సమచారం. పంచాయతీ ఎన్నికలకు ముందే ఈ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చేయనున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎంతో సహ 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి చాన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి చాన్స్ దక్కే అవకాశం ఉంటుందంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని ముఖ్య నేతలు చెప్తున్నారు.
మంత్రి పదవుల ఆశావహుల్లో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్యే తీవ్ర పోటీ ఉంది. అయితే అధిష్ఠానం తనకే చాన్స్ ఇస్తుందని వివేక్ ధీమాగా ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఆశలు పెంచుకున్నారు.
కాగా, క్యాబినెట్ లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు చాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఈమేరకు ఢిల్లీ పెద్దల నుంచి హామీ దక్కినట్టు సమాచారం. యువకులకు మంత్రివర్గంలో పెద్దపీట వేయాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసీ వేణుగోపాల్ నుంచి రోహిత్ కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కితే అతిపిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డ్ సృష్టించనున్నారు. అయితే హోంమంత్రి పదవిని ఎవరైనా కేటాయిస్తారా? లేదా రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకుంటారా? అనేది అధిష్ఠానం నిర్ణయించనుంది.