JAISW News Telugu

Free bus : ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు.. నెలకు రూ.250 కోట్లు ఖర్చు

Free bus : ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ప్రస్తుతం దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు, అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్ మెంట్ ఎలా.. తదితరాలపై అధ్యయనం చేశారు.

సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా శాఖలపై సోమవారం నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఏపీలో ప్రతిరోజు సగటున 36-37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 40 శాతం మంది అంటే 15 లక్షల మంది మహిళలు ఉంటున్నారు. వీరికి ఉచిత ప్రయాణం అమలుచేయవలసి ఉంటుంది.

Exit mobile version