TDP MLCs : టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
TDP MLCs : తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా సాగుతోంది. ప్రస్తుతం 4 స్థానాలకు 25 మందికి పైగా ఆశావహులు పోటీలో ఉండగా, అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు సోమవారం గడువు కాగా, ఆదివారం అభ్యర్థుల జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే జనసేన తరఫున నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన నాలుగు స్థానాలను టీడీపీ భర్తీ చేయనుంది. ఈ ఎంపికలో బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చే యోచనలో పార్టీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన సీనియర్లకు అవకాశం కల్పించొచ్చని టాక్ నడుస్తోంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్ వంటి నాయకులు పోటీలో ఉన్నారు. బీసీ కోటాలో బుద్దా వెంకన్న, జంగా కృష్ణమూర్తి, బీదా రవిచంద్ర రేసులో ఉండగా, ఎస్సీ కోటాలో కేఎస్ జవహర్, పరసా రత్నం, పీతల సుజాత పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
అన్ని ఆశావహులకు అవకాశం కల్పించడం ప్రస్తుతం సాధ్యం కాకపోయినా, 2027 నాటికి 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో భవిష్యత్తులో మరింత మంది నేతలకు న్యాయం చేస్తామని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది.