Ex Minister Jagdish Reddy : జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లేఖ

Ex Minister Jagdish Reddy : బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ కొనుగోళ్ల విషయంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ కు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న విద్యుత్ అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న పోటీ వాతావరణం దృష్ట్యా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. 2003 కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం పీజీసీఐఎల్ నిబంధనల్ె లోబడే ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడిందే గానీ, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

భద్రాద్రి విద్యుత్ కేంద్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం విషయంలో అప్పుడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకు రావడంతో కొత్తగూడెంలో 800 మోగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లేఖలో వెల్లడించారు.

ఒక విషయంలో విచారణ జరుపుతున్నప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన అందరినీ విచారించాలి గానీ, కొంతమంది వద్దే సమాచారం తీసుకొని మీడియా సమావేశంలో మాట్లాడటం బాధాకరమన్నారు. ఇది తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను జగదీశ్ రెడ్డి జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ కు పంపించారు.

TAGS