CM Chandrababu : తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుమలకు వెళ్లే వారికి సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేస్తూ ట్వీట్ చేశారు.
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం అన్నారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని, ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని సీఎం చెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నవగా ఎవరూ వ్యవహరించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ఓం నమో! శ్రీ వెంకటేశాయ నమః అని ట్వీట్ చేశారు.