PM Modi : దేశంలో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. తుది విడత అనగా 7వది జూన్ 1న జరుగబోతోంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా ప్రధాని మోదీ దేశ వ్యాప్త ప్రచారంలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. వినూత్న ప్రచారం చేయడంలో.. ప్రజలను తమ మార్క్ తో ఆకట్టుకోవడం మోదీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినా..తాను ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు ఆయన. తాను చేసే ప్రతీ పనికి తగిన ప్రచారం వచ్చేలా చేసుకోవడం ఆయనకు అలవాటే.
ఇక ఎన్నికలు వస్తే చాలు ఆయన ప్రచారం మరింత రాటుదేలుతుంది. గతంలో ఎన్నికల గడువు ముగిసినా ఉత్తరాఖండ్ వంటి చోట్ల ధ్యానం చేసి రోజంతా వార్తల్లో నిలిచారు. ఇది కూడా ప్రచారమేనని ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా అదే వ్యూహాన్ని మరోసారి పట్టాలెక్కించారు మోదీ. తుది విడత ఎన్నికల ప్రచార గడువు ముగిసినా వెంటనే..తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం సాయంత్రం నుంచి 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఇక 45 గంటలంటే జాతీయ మీడియా ఏ రేంజ్ లో ప్రచారం చేస్తుందో తెలియంది కాదు.
జూన్ 1న ఎన్నికలు పెట్టుకుని ఈ ధ్యాన ప్రచారం ఏమిటని ఇండియా కూటమి నేతలు భగ్గుమంటున్నారు. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. ధ్యానం చేయడానికి ఎవరైనా కెమెరాలతో సహ సరంజామా తీసుకెళ్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల ప్రచార గడువు ముగిసినా ప్రచారం చేయడానికే ఈ ప్లాన్ అంతా అని ఆరోపిస్తున్నారు. మరి ఇండియా కూటమి నేతల ఫిర్యాదును ఎన్నికల సంఘం పట్టించుకుంటుందా? లేదా అనేది చూడాలి. మోదీ ధ్యానం జూన్ 1 న ఓటు వేసే ఓటర్లపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో కూడా చూడాలి.