Big Hero Kantha Rao : తెలుగు తెరపై తిరుగులేని జానపద కథానాయకుడు కాంతారావు. ఓ వైపు పౌరాణికాలతో ఎన్టీఆర్.. మరోవైపు రొమాంటిక్ హీరోగా అక్కినేని దూసుకుపోతున్న తరుణంలో జానపద కథలను పరిగెత్తించిన యువరాజు కాంతారావు. అలాంటి ఆయన.. చివరి రోజుల్లో ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు. లెజెండరీ నటుడు కాంతారావును కత్తి కాంతారావు అని పిలుచుకుంటారు. కత్తి పట్టి యుద్ధాలు చేయడంలో కాంతారావు అప్పట్లో స్పెషలిస్ట్. కత్తి దూయడంలో ఆయనకు స్పెషల్ ఇమేజ్ ఉండేది. కాంతారావు కత్తి సన్నివేశాలు ఉన్నాయంటే? ఆ సినిమా హిట్టే అన్నంత పేరు సంపాదించుకున్నారు. ఆ రకంగా కత్తి కాంతారావు ఇంటి పేరుగా మారిపోయింది. ఆయన గురించిన అనేక విషయాలను కాంతారావు కూతురు సుశీల ఓ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
‘‘నాన్నగారికి అప్పట్లోనే 400 ఎకరాలు ఉండేవి. విజయవాడకు ఏదైనా కొత్త సినిమా వస్తే స్నేహితులతో కలిసి వెళ్లేవారు. ఆ డబ్బు కోసం భూములు అమ్మేసేవారు. అప్పట్లో ఎకరం 1200 రూపాయలే. నిర్మాతగా మారే సమయానికి 50 ఎకరాలు మాత్రమే ఉండేవి. 1964లోనే మద్రాసులో నాన్నగారు పెద్ద బంగ్లా కొన్నారు. మూడు కార్లు .. ఎనిమిది మంది నౌకర్లు ఉండేవారు. మా నాన్న మాకు ఎలాంటి కష్టం తెలియకుండా పెంచారు. అలాంటి ఆయన సొంతంగా తీసిన ఐదు సినిమాల కారణంగా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకోవలసి వచ్చింది. ఆయన చాలా మొండిమనిషి .. ఎవరు చెప్పినా వినిపించుకునేవారుకాదు. తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు నాన్న ఎవరికీ చెప్పుకోలేదు. తెలిసినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు.
నాన్నకి జాగ్రత్తపడటం తెలీదు. పక్కనే ఉంటూ ఆయనని గైడ్ చేసేవారు కూడా ఆ రోజుల్లో లేకపోయారు. అందువలన తనకి తోచింది చేస్తూ వెళ్లారు. ఆయనకి ఇల్లు కూడా లేకుండా కష్టపడుతున్నాడనీ, చిన్నచిన్న వేషాలు వేస్తున్నారని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. మేమున్నాము అని నాన్నకి సాయం చేసేంత మంచి మనసు హీరోలకు ఉందని నేను అనుకోవడం లేదు. హీరోలు మాత్రమే కాదు ఏ ఆర్టిస్టు కూడా ఆ సమయంలో రాలేదు. నాన్న పోయిన తరువాత అంతా కనిపించకుండా పోయినవారే. అందుకే మా ఫ్యామిలీ వైపు నుంచి ఎవరూ ఇండస్ట్రీకి వెళ్లడానికి ఆసక్తిని చూపలేదు” అని చెప్పారు.