CM Chandrababu : సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణమని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి తల్లి, చెల్లిపైన వారి పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారన్నారు. ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురికావడం తనను ఎంతగానో బాధపెట్టిందన్నారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారని.. చేయని తప్పునకు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ధైర్యం కోల్పోలేదన్నారు. 53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసిందని, ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వ హననం జరుగుతోంది. మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. మమ్మల్ని మాత్రమే కాదు.. సొంత తల్లి, చెల్లిని కూడా తిడుతున్నారు. వాళ్లని ఏం చేయాలి? ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా? సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిని ఎలా నియంత్రించాలనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగాలి. సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉండాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్టు ఇచ్చాను. దాన్ని అమలు చేయడం వల్ల టెలికాం రంగం వృద్ధి చెందింది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ప్రజలకు చేరువగా, సులువుగా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది మా లక్ష్యమన్నారు. ః ఏఐ, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చని సూచించారు.