JAISW News Telugu

AP Volunteers : వాలంటీర్లు లేకున్నా పింఛన్లు ఆగలేదు..ఆ వ్యవస్థపై ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది?

AP Volunteers

AP Volunteers

AP Volunteers : ఏపీలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదా అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. అదే సమయంలో వాలంటీర్లను దూరంగా పెట్టి ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ చేశారు. వాలంటీర్ల సాయం లేకుండానే ఇంత పెద్ద కార్యక్రమం రెండు రోజుల్లోనే పూర్తి చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని వైసీపీ నేతలు చాలా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇవాళ వాలంటీర్లే లేరు.. కానీ పెన్షన్ ఎక్కడైనా ఆగాయా అని ప్రశ్నించారు. రెట్టింపైన పెన్షన్ సచివాలయ ఉద్యోగులు వచ్చి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గతంలో వైసీపీ పాలనలో నాలుగైదు రోజులు పెన్షన్లు ఇచ్చేవారని ఆయన అన్నారు. కానీ తమ ప్రభుత్వం హయాంలో రెండు రోజులలోనే 100శాతం పెన్షన్లు ఇస్తామన్నారు. అయితే వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అన్న దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రతీ ఒక్క శాఖలో పరిశీలిస్తే లోతులు తెలియడం లేదని పవన్ అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో అప్పులు చేసి భారీగా ఆర్థిక నష్టం చేకూర్చారని గత ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని చూసిన తరువాత తాను ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడానికి ఇష్టపడటం లేదన్నారు. కాగా, వాలంటీర్ల సేవలను రాష్ట్రంలో ఎలా ఉపయోగించుకుంటారనేది మున్ముందు మాత్రమే తెలియనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టే వాలంటీర్ల భవిష్యత్ ఆధారపడి ఉంది.

Exit mobile version