TDP MLA : ఇసుక ఉచితంగా అందించినా డ్యామేజ్ చేస్తోంది : టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన
TDP MLA : ఏపీ రాజకీయాల్లో ఇసుక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక విధానాన్ని పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. కానీ అదే ఆయనకు డ్యామేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇసుకను ఉచితంగా అందజేస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఇసుకను ఉచితంగా అందజేస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు పెద్ద పండుగలా నిర్వహించారు. కానీ తర్వాత అసలు విషయం బోధపడలేదు. ఇసుక ఉచితం అయితే లబ్ధిదారుడు ఇసుకను ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు చెల్లించాలి. దీంతో ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో ఇసుక చౌకగా దొరికిందని, ఇప్పుడు టన్నుకు రూ.1300 వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఉచిత విధానం పై టీడీపీ నేతలు ఎంత కప్పిపుచ్చుకున్నా ఉచితంగా ఇసుక దొరకడం లేదన్నది అక్షర సత్యం.
ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గురజాల జగన్మోహన్ రావు ఇసుక ఉచిత సరఫరాపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇసుక సరఫరా జరగడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుక ధర కూడా ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందని ఎమ్మెల్యేలు పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరే సరికి పాత ధరే పడుతోంది. ప్రజలు అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలియజేశారు.
దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రస్తుతం ఇసుక రీచ్‌లు పూర్తిస్థాయిలో తెరవకపోవడంతో ఇసుక సరఫరాకు కొంత సొమ్ము వెచ్చిస్తున్నారని, స్టాక్‌లో ఉన్న ఇసుక సరఫరా చేస్తుండడంతో ఖర్చు కనిపిస్తుందని ఎమ్మెల్యేలతో అన్నారు.