KCR – Chandrababu : జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే రాష్ట్రాల్లో క్రేజ్ ఎక్కువ అన్న విషయాన్ని ఒప్పుకోకతప్పదు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవాలని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఇంకా సంకుచిత బుద్ధిని మాత్రం వదులుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి దశబ్దం గడుస్తున్నా తెలంగాణ వాదాన్నే నమ్ముకొని రాజకీయాలను చేయడం ఎంత వరకు సబబు.
2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని తొలి అడుగు వేసిన ఇరు రాష్ట్రాల సీఎంలు హైద్రాబాద్ ప్రజాభవన్ వేదికగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఐదేళ్ల అవమానాలు, అపహాస్యాల తర్వాత సీఎంగా గెలిచి మొదటిసారి తెలంగాణకు వచ్చిన బాబుకు ఘనస్వాగతం లభించింది.
అటు పార్టీ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం బాబుకు రెడ్ కార్పెట్ వేయడంతో తమలోని అసూయను, ఆక్రోశాన్ని మరోసారి బయటపెట్టారు బీఆర్ఎస్ నాయకులు. ఏపీ నాయకుల పెత్తనం తెలంగాణకు అవసరమా..? ఏపీ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు మొదలు పెడుతున్నాయి..? పెళ్లి ఏపీలో అయితే పందిరి తెలంగాణలో వేస్తున్నారు అంటూ బాబుపై విషం చిమ్మింది.
పార్టీలుగా భిన్నాభిప్రాయాలు ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణం 2 రాష్ట్రాల ప్రజలకు అవసరం. ఐదేళ్లుగా వైసీపీ జెండాకు కాపు కాసి, జగన్ కు లోపాయికారి మద్దతిచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేయడం చూస్తుంటే బీఆర్ఎస్ కు టీడీపీ పార్టీ అంటే భయమా.? లేక బాబు అంటే అసూయా.?
‘బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా’ అంటూ వైసీపీకి వత్తాసు పలికిన కేసీఆర్ చివరికి అదే టీడీపీ మద్దతుదారుల నుంచి రిటర్న్ గిఫ్ట్ అందుకొని తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేసుకున్నారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాల్లో గులాబీ రంగును పరిచయం చేసినా ఏనాడూ బాబు కానీ, టీడీపీ కానీ, కేసీఆర్ ను కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ తప్పుపట్టలేదు.
రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. ప్రజాదరణ ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయచ్చు అనే ప్రాథమిక హక్కును గౌరవిస్తూ బాబు కేసీఆర్ రాజకీయాల్లో (తెలంగాణ) వేలు కాదు కదా.. గోరు కూడా పెట్టలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం బాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే భావిస్తోంది.
బాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు అనధికారికంగా జగన్ కు మద్దతు పలికిన కేసీఆర్ తానూ ఓడిపోయినప్పటికీ వైసీపీ గెలుపునకు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు బాబు ఓటమి, టీడీపీ పతనాన్ని కోరుకున్న బీఆర్ఎస్ పార్టీని కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కానీ, బాబు ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.
తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా బాబు మాత్రం బీఆర్ఎస్ పై ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. ఐటీ రంగంతో హైద్రాబాద్ కు వేసిన అభివృద్ధి పునాదిని కాంగ్రెస్, బీఆర్ఎస్ కొనసాగించాయి తప్ప విధ్వంసం చేయలేదన్నారు.
కానీ ప్రశంసించడానికి కానీ ముందుకు రాని బీఆర్ఎస్ బాబుపై విమర్శలు చేయడానికి మాత్రం ఒంటి కాలు మీద లేస్తుంది. తన ఓటమిని కోరుకుంటూ తెలంగాణలోనే పురుడు పోసుకున్న టీడీపీ పతనాన్ని ఆకాంక్షిస్తూ, తన కారుతో సైకిల్ ను నామరూపాలు లేకుండా చేయాలనుకొని బీఆర్ఎస్ నిత్యం బాబుపై ఎంత విషం చిమ్మినా బాబు మాత్రం ప్రేమతోనే సమాధానం ఇస్తున్నారు.