Jagan : ఆ విషయంలో జగన్ ప్రాధేయపడినా జనం నమ్మరు..!
Jagan : సీఎం జగన్ గత ఐదేళ్ల పాలన కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఏవో రెండు సంక్షేమ పథకాలు తప్ప జనానికి పెద్దగా ఒరిగిందేమి లేదు. జగన్ చేసిన పెద్ద తప్పుల్లో మొదటిది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం. మూడు రాజధానులంటూ కొత్త పాట పాడి..నాలుగేళ్లుగా రాజధాని విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. ఇక రెండో సారి తనకు పగ్గాలు అందిస్తే విశాఖ కేంద్రంగా పాలన చేస్తానని మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఆయన తీరు చూస్తుంటే.. రాజధాని భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. రాజధాని లేకుండా చేయడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో అని మధనపడిపోతున్నారు. దీనిపై ప్రజల్లో కొంచెమైనా నమ్మకం కలిగేందుకు విశాఖ నుంచి పాలన మొదలవుతుందని ప్రగాల్భాలు పలుకుతున్నారు.
2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా కార్యాచరణ కూడా ప్రారంభించింది. కొద్ది సంవత్సరాల్లోనే హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా రాజధానిని నిర్మించేందుకు అంతా సిద్ధం చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో మూడు రాజధానులు పేరిట ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని జగన్ సర్కార్ పై ప్రజలు మండిపడుతున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా జగన్ మూడు రాజధానుల విషయమై పెదవి విరిచారు. రాజధాని విషయమై యువత మరింత రగిలిపోతోంది. తమకు రాజధానంటూ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో రాబోయే ఎన్నికల్లో రాజధాని విషయమే ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారింది. ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని దిగజార్చరని జగన్ సర్కార్ పై సొంత చెల్లి షర్మిల, ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇది రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిబంధకంగా మారుతుందని అంచనా వేశారేమో గానీ, మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా జగన్.. రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే చట్టపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తెలిసినా మ్యానిఫెస్టోలో చేర్చడం ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో ముందడుగు పడేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.