GunturKaaram Tickets : ‘గుంటూరుకారం’ ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది. సంక్రాంతి పండుగకు ఏ ఒక్కరూ తగ్గకుండా 3 పెద్ద సినిమాలతో పాటు హనుమాన్ వంటి సినిమా కూడా వచ్చింది. అందరి టార్గెట్ సంక్రాంతి పండుగ. ఎందుకంటే పండగవేళ సినిమాలకు రీచ్ ఎక్కువుంటుందని, జనాలు ఏ సినిమానైనా ఆదరిస్తారనే నమ్మకం నిర్మాతలది. అందుకే పాన్ ఇండియా కంటెంట్ తో వచ్చిన అప్ కమింగ్ హీరో తేజ సజ్జా మూవీ హనుమాన్ వచ్చింది. ఇది ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకు పోటీగా వచ్చింది. కారుతో ఢీకొట్టే సైకిల్ విరిగిపోతోందని కొందరు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. కానీ గుంటూరు కారం తొలి ఆటతోనే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆ సినిమా నిర్మాతల ఓవర్ కాన్ఫిడెన్స్ కు బ్రేక్ పడింది.
హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు గుంటూరుకారం సినిమా పాత చింతకాయ పచ్చడే అని అభిమానులు సైతం కామెంట్స్ చేయడంతో ఆ సినిమాకు కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ సిని నిర్మాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి స్పెషల్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు కష్టపడి అనుమతులు తెచ్చుకున్నారు. పెద్ద హీరో సినిమా అని ఎక్కువ ఆటలు వేస్తామని, భారీ బడ్జెట్ కాబట్టి టికెట్ రేట్లు పెంచుకుంటామని ఆ పర్మిషన్లు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ అనుమతులేవీ పనిచేసేలా కనపడడం లేదు.
గుంటూరు కారం మూవీకి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18వరకూ ‘ప్రత్యేక’ అనుమతి ఇచ్చింది. ఈ వారం రోజుల్లో టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు రోజుకు 6 షోలు వేసుకోవచ్చు. అయితే ఫలితం ఊహించిన దానికి భిన్నంగా రావడంతో..హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో స్పెషల్ షోలు రద్దయ్యాయి. 90శాతానికి పైగా స్క్రీన్లలో 4 ఆటలే ఆడిస్తున్నారు. అయినప్పటికీ ఆన్ లైన్ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఆదివారం బుకింగ్స్ కూడా నిరాశజనకంగా ఉన్నాయి. ఇక ప్రత్యేక అనుమతితో సంబంధం లేకుండా టికెట్ రేట్లు తగ్గించాలని నిర్మాత ఆలోచిస్తున్నారు.
ఇక ఏపీలో 10 రోజుల పాటు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే పరిస్థితి లేదు. అంటే ఆ అనుమతులు నిర్వీర్యం అయినట్టే. ఇలా కష్టపడి తెచ్చుకున్న అనుమతులు వృథా అయినట్టే అని తెలుస్తోంది. సంక్రాంతి విజేతగా నిలుద్దామని అనుకున్నా.. ‘గుంటూరు కారం’కథే దెబ్బకొట్టడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిఉన్నారు. ఇక నిర్మాత బ్లాక్ బస్టర్ పక్కా అనుకున్నా.. హనుమాన్ మూవీ చేతిలో చతికిలబడడాన్ని ట్రోల్ చేస్తున్నారు. అందుకే స్టార్ హీరో అయినా.. కథలో దమ్ము, కథనంలో నైపుణ్యం లేకుంటే వర్క్ వుట్ కాదని ఆ మూవీ యూనిట్ కు తెలుసొచ్చింది.