YCP Rowdies : రెచ్చిపోయిన వైసీపీ గుండాలు.. నిండు గర్భిణిని కాలితో తన్ని..

YCP Rowdies

YCP Rowdies kicked Pregnant woman

YCP Rowdies : ప్రస్తుతం రాష్ట్రమంతా ఎన్నికల హడావుడి నడుస్తోంది. నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు కూడా తమకున్న ఇబ్బందులను నాయకుల ముందు ఉంచుతున్నారు. అలా తమ సమస్యలను చెప్పుకున్న ఓ మహిళపై వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. నిండు గర్భిణి అన్నది కూడా చూడకుండా కాలితో తన్ని దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను.. వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించిన  గర్భిణిని నేలపై పడేసి, కాలితో తన్ని దుర్భాషలాడారు. అడ్డొచ్చిన ఆమెను కూడా గొంతు పట్టుకుని దారుణంగా దాడిచేశారు.  

ఆ సంఘటనలో మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి  తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. దీంతో ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కూటగోళ్లపల్లెలో సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డితో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కల్యాణి ఇంటికి వెళ్లి.. వైసీపీకి ఓటేయాలన్నారు. ఈ సందర్భంగా కల్యాణి(8 నెలల గర్భిణి) స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని చెప్పింది. రాత్రిళ్లు చిన్నారులు బయట తిరగాలంటే భయంగా ఉందని తెలిపింది. దీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ నాయకులు.. ఆ విషయం వదిలేసి కల్యాణిని తిట్టిపోశారు. ఆమె భర్త మల్లికార్జునను పిలిపించమని చెప్పారు. కల్యాణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మల్లికార్జునపై 10 మంది వైసీపీ నాయకులు దాడికి దిగారు.   భర్తను కాపాడుకోవడానికి అడ్డుపోయిన కల్యాణిని కింద పడేసి కాలితో తన్నారు.

ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి భార్య అడ్డు చెప్పకపోవడం శోచనీయం. వైసీపీ నాయకుల దాడిలో కల్యాణి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కల్యాణి భర్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ప్రచారానికి వచ్చి తన భార్యను, తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి ద్వారకనాథరెడ్డి సతీమణి సమక్షంలోనే తమపై దాడి జరుగుతున్నా ఆమె కనీసం అడ్డు చెప్పలేదన్నాడు.  సుదర్శన్‌రెడ్డి, మల్లిరెడ్డి వారి అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఈ విషయమై ములకలచెరువు పోలీసులకు ప్రభుత్వాస్పత్రి అవుట్‌పోస్టు సిబ్బంది సమాచారం అందించారు.  ఈ ఘటన తర్వాత తమను నిలదీసిన వారిపై దాడి చేసేందుకు వైసీపీ వారు దాదాపు 20 వాహనాల్లో మళ్లీ కూటగోళ్లపల్లెకు వచ్చారు.  పోలీసులు వీరిని ఊరి బయటే అడ్డుకుని వెనక్కి పంపారు.

TAGS