CM Chandrababu : ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయండి: సీఎం చంద్రబాబుకు వైవీబీ రాజేంద్రప్రసాద్ వినతి
CM Chandrababu : 2018-19 సంవత్సరంలో చేసిన ఉపాధి హామీ పనుల పాత బకాయిలను చెల్లించాలని, అలాగే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన కూడా బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేసిన అధికారులపై విచారణ జరిపి శిక్షలు విధించాలని సీఎం చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆదివారం వినతి పత్రం అందించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి త్వరలోనే బిల్లులు చెల్లించడమే కాకుండా, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మీడియాతో రాజేంద్రప్రసాద్ చెప్పారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి పనుల బకాయిలను జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆయన మండిపడ్డారు. కాగా, సీఎంకు రాజేంద్రప్రసాద్ అందించిన వినతి పత్రంలోని వివరాలను చూస్తే..
వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019 -24 మధ్యకాలంలో రాజకీయ కక్షతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చట్ట వ్యతిరేకంగా నిలిపివేసిన చెల్లింపులు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 2018-19 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలు ద్వారా చేసిన పనులు అన్నింటికీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను నిలుపుదల చేస్తూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్నారు. ఈ పనులు అన్నింటిని ఇంజినీరింగ్ అధికారులు ఎం బుక్ రికార్డు చేయడం, చెక్ మెజర్మెంట్ చేయడం, క్వాలిటీ కంట్రోల్ నిర్వహించడం, సోషల్ ఆడిట్ జరిపి ఎఫ్డిఓ లను చెల్లింపుల కోసం పంపించారన్నారు. ఆ దశలో మళ్లీ విజిలెన్స్ పేరిట అక్రమంగా బిల్లులు నిలిపివేశాన్నారు. దీనిపై అనేక వందల కేసులు హైకోర్టులో దాఖలు అయ్యాయన్నారు.
దీనిపై పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ గతంలో స్పందిస్తూ రూ.5 లక్షల లోపు విలువ ఉన్న 7 ,95,494 పనులలో కేవలం 11,918 పనులను పరిశీలించామని వాటిలో జిల్లా కమిటీ పనులకు 21.02 శాతం మరియు మండల కమిటీ పనులకు 6.33 శాతం తగ్గించి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అన్ని రకాల సర్టిఫికేషన్ జరిగిన తర్వాత ఆ తగ్గింపులకు అర్థం ఏమిటో ఎవరికీ తెలియదని, ఆ మేరకు కూడా చెల్లింపులు జరపలేదని వినతి పత్రంలో రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ వారు మరొక మెమోనిస్తూ రూ.5 లక్షల విలువకు మించిన పనులకు కూడా ఇదే కోతను నిర్దేశిస్తూ చెల్లింపులు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలపాటు అనేక వందల కేసులు హైకోర్టులో (కోర్టు ధిక్కార కేసులతో సహా) వేసిన తర్వాత మాత్రమే దఫా దఫాలుగా కొన్ని పనులకు నిధులు విడుదల చేశారన్నారు. సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత కోతను విధిస్తూ జారీ చేసిన పై రెండు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు కక్ష దారులు వెళ్ళగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిందన్నారు.
నిలిపివేసిన అన్ని పనులకు కోత విధిస్తూ చేయవలసిన అన్ని చెల్లింపులు ఒక నెలలోగా తప్పనిసరిగా చెల్లించాలని కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. అలాగే ఈ ఆర్డర్ తేదీ నుంచి నాలుగు నెలల్లో ఆ పనులపై పునర్ విచారణ జరిపి కోత విధించవలసిన అవసరం ఉన్నది లేనిది సంబంధిత వ్యక్తులకు తమ వాదనను వినిపించుకునే అవకాశం ఇస్తూ విచారణ పూర్తి చేయాలని, ఆ పనులలో లోపాలు లేవని గుర్తించినట్లయితే కోత విధించిన మొత్తాలను, మొత్తం బిల్లుపై 6 శాతం అపరాధపు వడ్డీని పనిచేసిన వారికి చెల్లించాలని ఆదేశించింది.
అలాగే రాజకీయ కక్షతో ఐదు సంవత్సరాల పాటు లక్షల మంది సర్పంచులను, పనిచేసిన సంస్థలను నిధులు విడుదల చేయకుండా సంక్షోభంలో పడవేసిన వైసీపీ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను కూడా చివరి వరకు పాటించలేదని వాపోయారు. గత ఐదు సంవత్సరాల్లో ఈ పనులకు ఆర్థిక వనరులు చేకూర్చిన కొంతమంది వ్యక్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని, అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయని, వేల కొద్ది కేసులు హైకోర్టులో వేసి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని వీబీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావడం తమకు ఎంతో భరోసా, విశ్వాసాన్ని కలిగించిందన్నారు. 2018-19లో పెండింగ్ బిల్లులను, అక్రమ కోతలకు సంబంధించి మొత్తాలను, వాటిపై ఆరు శాతం అపరాధపు వడ్డీని చెల్లించే ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ఉపాధి చట్టం నిబంధనలను రాజకీయ నాయకుల ప్రేరణతో నిర్భయంగా ఉల్లంఘించి వేలమంది వ్యక్తులను సంక్షోభానికి గురిచేసి వారి జీవితాలను అతలాకుతలం చేసి, కొందరి మరణాలకు కూడా కారణమైన సంబంధిత అధికారులను గుర్తించి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వినతి పత్రం అందించిన వారిలో వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఏపీ సర్పంచుల సంఘం వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ బిర్రు ప్రతాప్ రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం పగడాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.