Oath Taking : పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది.. ఇంకా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. నీకెందుకు రాజకీయాలు.. మూడు కాకపోతే నాలుగు పెళ్లిళ్లు చేసుకుపో అంటూ చీత్కారాలు.. చీదరింపులు.. అవమానాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎదుర్కున్నారు పవన్ కల్యాణ్. కానీ ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గోడకు కొట్టిన బంతి వలే పిఠాపురంలో ఎమ్మెల్యే గా గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు.
అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని విమర్శించిన వారి చెంప చెల్లుమనిపించేలా చేసిన పవన్ కల్యాణ్ ను చూసి ఆయన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వంలో మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం సందర్బంగా.. ఇటు మెగా కుటుంబం.. అటు నారా వారి కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ హాజరైంది. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరీ మాట్లాడుకోవడం కనిపించింది. బాలకృష్ణ చెల్లెలు భువనేశ్వరికి అప్యాయంగా తలపై ముద్దు పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ లేచి నిలవడి చప్పట్లు కొట్టారు. నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు బ్రాహ్మిణి చప్పట్లతో ఎంజాయ్ చేసింది. కొడుకు దేవాన్ష్ తో కూడా చప్పట్లు కొట్టించింది.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య అన్నా లెజ్నోవా.. ఫోన్ లో ఆ వీడియో చూస్తూ ఆనందంలో మునిగిపోయింది. పవన్ కుమారుడు అఖిరా నందర్, మెగా స్టార్ కుటుంబ సభ్యులు, నాగబాబు, శ్రీజ, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరూ హాజరై ఆనందంలో మునిగిపోయారు. పవన్ ఏకంగా తన అన్నయ్య మెగాస్టార్ ను ప్రధాని మోదీకి స్టేజీపైనే పరిచయం చేశాడు. మొత్తం మీద టీడీపీ, జనసేన నేతల మధ్య ఒక గొప్ప వాతావరణం కనిపించింది.