Electric shock : తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఫ్లెక్సీలు కడుతుండగా నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న రాయుడు విగ్రహావిష్కరణ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు నేడు ముహూర్తాన్ని నిర్ణయించారు. దీంతో విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఫ్లెక్సీలను కొందరు యువకులు కడుతుండగా విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. బొల్లా వీర్రాజు, కాశగాని కృష్ణ, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ సంఘటన స్థలంలోనే చనిపోయారు.
మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన కోమటి అనంతరావును తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది.