AP Elections Schedule : మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత మొదటి వారం మొత్తం పార్లమెంట్ సమావేశాలు జరుగతాయి. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. ఓటర్ల జాబితాలను కూడా విడుదల చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల కొనుగోళ్లు.. ఇలా ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది.
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమి ఎన్నికలు సమాయత్తమవుతున్నారు. బీజేపీ నిన్నటిదాక రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా.. ఇక ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు అయిపోగానే..మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ నుంచి పశ్చిమ ప్రాంతానికి ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఓ రకంగా ఇది కూడా ప్రచారమే అని చెప్పాలి.
ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం పేరు మీదుగా ఎన్నికల ప్రణాళిక లేఖ ఒకటి బయటకు వచ్చింది. దానిలో సార్వత్రిక ఎన్నికల తాత్కాలిక తేదీని ప్రకటించడం విశేషం. ఇది ఎన్నికల అధికారుల అంతర్గత లేఖగా కనిపిస్తోంది. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు నిర్వహించాలో దాని ఏర్పాట్లు ఎలా చేయాలి తదితర వివరాలు అందులో క్రోఢికరించారు. దీని ప్రకారం ఎన్నికల తాత్కాలిక తేదీని 16.04. 2024గా గుర్తించారు. ఈ తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 24న తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిగతావి వరుసగా ఆరేడు దశల్లో జరుగనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అందులో ఆదేశించారు.
అయితే ఏపీలో తొలి దశలోనే ఎన్నికలు ఉండనున్నాయని గతంలో అధికారులు చెప్పారు. దాన్ని బట్టి ప్రారంభతేదీ ఏప్రిల్ 16నే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. అంటే రాజకీయ పార్టీల చేతుల్లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే మిగిలిఉండే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి సమయంలోనే అభ్యర్థుల ప్రకటన, ప్రచారం చేసుకోవాల్సి ఉంది.