JAISW News Telugu

Big Test All Parties : ఎన్నికలే అతి పెద్ద పరీక్ష.. పార్టీలు, అభ్యర్థులు ఒకవైపు.. అంతిమ తీర్పు ఓటర్లదే..

Big Test All Parties

Big Test All Parties Telangana Elections 2023

Big Test All Parties Telangana Elections 2023 : ప్రజా స్వామ్యంలో ఎన్నికలే అతి పెద్ద పరీక్ష. ఎంత పెద్ద బలవంతుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా ఎన్నికలు వచ్చాయంటే సామాన్య ఓటరు ముందు వంగి నిలబడాల్సిందే. దండం పెట్టాల్సిందే.  ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అదే పరిస్థితి కనిపిస్తున్నది. రాజకీయ ఉద్దండులు అనుకున్న నేతలు కూడా ప్రజా క్షేత్రంలోకి వచ్చేసరికి గెలుపోటములపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఐదేళ్లకోసారి వచ్చే ఈ ఎన్నికలు ఓటరుకు అతిపెద్ద అస్ర్తం.

అయితే ఈసారి పార్టీలు, అభ్యర్థులు ఎవరి నమ్మకాలు వారివి. మరి ప్రజల నాడి పట్టేదెట్ల,, వారిని ప్రసన్నం చేసుకోవడం ఎలా.. అందుకే సర్వశక్తులూ ఒడ్డేందుకు అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. ఇక అన్ని పార్టీల్లోనూ ఈ సారి జంపింగ్ జపాంగ్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ఈసారి మూడు పార్టీలే కీలకం. ఐదారు స్థానాల్లో ఎంఐఎం, ఒకటి, రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు మినహా మరే పార్టీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.

అధికార పార్టీని చూసుకుంటే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా ఉన్నారు. అన్ని స్థానాల్లో అభ్యర్థిగా సీఎం కేసీఆరే కీలకం కానున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొనే ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను వివరిస్తున్నారు. రైతుబంధు, ధరణి, కరెంట్, ఇలా పలు విషయాలపై ప్రజలనే వివరణ అడుగుతున్నారు. ఇక అధికార పార్టీలో మరో ఇద్దరు నేతలు కూడా పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ కవిత ఈసారి నిజామాబాద్ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆమె అక్కడ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా ప్రజల్లో ఆదరణ ఈ పార్టీకి ఉన్నా, రేసులోకి అనుకోకుండా ప్రతిపక్షాలు దూసుకురావడమే కొంత ఇబ్బందికరంగా మారింది. దీని వెనుక పార్టీ స్వయంకృపారాధాలు ఉన్నాయనే అభిప్రాయం శ్రేణుల్లోనూ ఉంది. కానీ దీనిపై ఏ ఒక్కరూ మాట్లాడడానికి సాహసించరు. ఎందుకంటే అక్కడ ఉంది కేసీఆర్.

ఇక తెలంగాణ లో అనుకోని వేవ్ ను సాధించింది కాంగ్రెస్. అయితే వీటిని ఓట్లుగా మల్చుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా అంటే కొంత సంశయంగానే కనిపిస్తున్నది. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే కొంత జాగురుకతతో వెళ్లాల్సి ఉంటుంది. ఆయన వ్యూహాలకు చిక్కకుండా, ఎత్తులకు పై ఎత్తులు వేస్తేనే అది సాధ్యం అవుతుంది. ఇక మిగిలి ఉన్న పది రోజులూ కాంగ్రెస్ కు కీలకమే. అయితే కాంగ్రెస్ లో ప్రస్తుతం కొంత ఐక్యత లోపించింది. సీనియర్లు ఎవరికి వారే అన్నట్లు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.

అధిష్టానం ఆదేశాలో లేక, ముందుగా తమ గెలుపును చూసుకుందామనుకున్నారో తెలియదు కాని, మొత్తం అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన భుజ స్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నారు. తెలంగాణలో ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రస్తుతం పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంది. అది సోషల్ మీడియానా, చానళ్లా అనే కంటే గ్రౌండ్ లెవల్ లో అర్థమయ్యేది కూడా అదే. ఇక కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేసుకుంటే తప్పా, కొంత అనూహ్య ఫలితాలే వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే అది కూడా కేసీఆర్ మైండ్ ను ఎదుర్కొంటేనే సాధ్యమవుతుంది. గ్రౌండ్ లెవల్ లో మాత్రం ఇంకా కాంగ్రెస్ కు అనుకున్న స్థాయి ఆదరణ ఉందా అంటే మాత్రం ఏ ఒక్క నేత కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

ఇక అనుకోకుండా ఈ రేసులో బీజేపీ వెనుక పడింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధికార పార్టీకి ప్రత్యామ్నాయంలా కనిపించిన పార్టీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఇక బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ లాంటి హామీలతో ఒక్కసారిగా రేసులోకి వచ్చేసినట్లు కనిపిస్తున్నా, అది కొంత వరకే పరిమితం. కేవలం సింగిల్ డిజిట్ సీట్ల వరకే బీజేపీ తన ప్రభావం ప్రస్తుత పరిస్థితుల్లో చూపించేలా కనిపిస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కీలక నేతలు కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ కూడా కాంగ్రెస్ లోచేరేందుకు సిద్ధమైంది.

ఇక ఈటల రాజేందర్, బండిసంజయ్ మాత్రమే కొంత తిరుగుతున్నట్లు కనిపిస్తున్నది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు  కిషన్ రెడ్డి ఈసారి పోటీలో లేకున్నా, అక్కడక్కడా సభల్లో కనిపిస్తున్నారు.  అయితే హంగ్ పై పూర్తి నమ్మకంతో ఆ పార్టీ ఉన్నట్లు కనిపిస్తున్నది. కింగ్ మేకర్ అయ్యే చాన్స్ తామే తీసుకుంటామని పదే పదే ఆ పార్టీ నేతలు చెబుతుండడం కూడా ఇందుకు కారణమవుతున్నది. ఇక స్వతంత్రులు కూడా అనుకున్న స్థాయిలో గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. పలు స్థానాల్లో బీఎస్సీ పోటీలో ఉన్న, ఒక్క సిర్పూర్ లో మినహా ఎక్కడా అంతగా ప్రభావం చూపించేలా కనిపించడం లేదు.

ఇక ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు మాత్రం ఓటరుదే. మరి ఈసారి ఆ ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడం మాత్రం కొంత కష్టంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ను నమ్మే పరిస్థితి కూడా లేదు. అయితే పూర్తి మెజార్టీ ఇస్తేనే ప్రభుత్వాలు మనుగడలో ఉండి, ప్రజలకు సంపూర్ణ పాలన అందించే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ల అధికారాన్ని కాపాడుకోవడానికి రాష్ర్టాన్ని కుక్కలు చించిన విస్తరి చేసినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికైనా,  ఏ పార్టీ కైనా కావాల్సింది అధికారమే. ఇందులో ప్రజాకోణం ఏం ఉండదు.

అందుకే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మేలు జరుగుతుంది. మనకే కాదు.. భావితరాలకు ఏ పార్టీ మేలు చేస్తుంది.. ఏ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. అది కాదనలేని సత్యం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం, ప్రజలే విచక్షణతో ఆలోచించి, ఓటు వేయాలి. ఏదేమైనా ఈ పది రోజులు మాత్రం ఓటరుదే. మరి చైతన్యవంతుడైన తెలంగాణ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారో డిసెంబర్ 3న తేలిపోనుంది.

Exit mobile version