Election Schemes : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9నే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ఇప్పటి వరకూ రెండు మాత్రమే అమలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు..వంటి రెడీమేడ్ హామీలను అమలు చేస్తున్నారు.
ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ ను కలిపి నిలిపివేయించారు. డిసెంబర్ 9న ఎకరానికి రూ.7500 ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ హామీలే ఏవి అమలు కాలేదు. పాత రైతుబంధు మొత్తాన్నే దశల వారీగా అందించారు.
మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉండడంతో రూ.500లకే గ్యాస్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీలను త్వరలోనే అమలు చేస్తామని సీఎం సమీక్ష చేసి మరీ చెప్పారు. రుణమాఫీ, మిగతా గ్యారెంటీలకు దిక్కే లేదు. ఈ ఆరు గ్యారెంటీలను అందరూ అర్హులే అన్నారు. కానీ మళ్లీ రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు అంటున్నారు. ఇలా అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పడంపై జనాలు మండిపడుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతున్నా ప్రజలకు పెద్దగా ఒరిగిందేమి లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం, నాలుగు సమీక్షలు చేయడం ఇదే జరుగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న క్షేత్రస్థాయిలో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో రోజూ ప్రయాణించేవారికి మాత్రమే ఆ ఇబ్బందులు అర్థమవుతాయి.
టికెట్ కొనుక్కుని మరీ ఆ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకని పురుషులు తమ సొంత వాహనంలోగాని, ప్రైవేట్ వాహనాల్లోగాని ప్రయాణిస్తున్నారు. పల్లెల్లోకి బస్సుల్లో వెళ్లడమే నరకయాతనే అవుతుంది. క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఎదురవుతాయని పట్టించుకోకుండానే పథకం అమలు చేశారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే వారే లేరు.
జనాల్లో ఇప్పటికే అసంతృప్తి బయలుదేరింది. మరికొద్ది రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయకపోతే ఆందోళనలకు దిగక మానరు. ఆ ప్రభావం ఎన్నికల్లోనూ పడే అవకాశం ఉంది.