Election Commission : ఏపీలో హింసపై ఈసీ సీరియస్ – పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్

Election Commission
Election Commission : ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ, పోలింగ్ రోజు అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైనా వేటు వేసింది. ఆ మూడు జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.
హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసుపై సిట్ వేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది. లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో వివరించింది.