Election Commission : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్ లను ధ్వంసం చేసి ఆరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈనెల 13వ తేదీన ఓటింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది రికార్డయింది. ఆ విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5 గంటల లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ పెట్టిన ట్వీట్ ను ఈసీ ప్రస్తావించింది.
అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు.