Election Commission : ఎన్నికల కోడ్ అంటేనే సాధారణంగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు భయపడిపోతుంటాయి. రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి అత్యంత శక్తివంత విధులను కేటాయించారు. ఎన్నికల క్రతువును సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీకి అదే స్థాయిలో పవర్స్ ను కూడా అప్పజెప్పారు. కానీ ఏపీలో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘనలను ఎన్నికల సంఘం అధికారులు చూస్తూ మిన్నకుండిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు విషయంలో క్షేత్రస్థాయిలో ఎన్నికల అధికారుల తీరును టీడీపీ సహ విపక్ష నాయకులు తప్పుపడుతున్నారు. కోడ్ పేరుతో ప్రతిపక్షాల వాహనాలను పదే పదే తనిఖీ చేస్తూ వారి రోజువారీ కార్యకలాపాలకు మోకాలడ్డేలా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కానీ అధికార వైసీపీ నేతల తాయిలాల పంపకాలను, వలంటీర్ల ప్రచారాలను అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అసలు ఈసీ పరిధిలో ఉన్నారా? లేదా? కోడ్ ను ఈసీ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తున్నారా? లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ యథేచ్ఛగా కోడ్ ను ఉల్లంఘిస్తోందని, వీటిపై నిరంతరం ప్రతిపక్షాలు ఆధారాలతో సహ జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు నగదు, బహుమతులు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తున్నా చూసీచూడనట్టుగానే అధికారులు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
వైసీపీ ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొనకుండా ఈసీ నిలువరించడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. వలంటీర్లు ప్రభుత్వంలో భాగమేనని, ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఎన్నికల సంఘం పలు జిల్లాల్లో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లను తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇలా తొలగించిన వలంటీర్లు యథేచ్ఛగా వైసీపీ నేతల ప్రచారంలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోకుండా, కేవలం విధుల నుంచి తొలగించి వదిలేయడంతోనే వారు రెచ్చిపోతున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.