Election Commission : ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు.. నో చెప్పిన ఈసీ

Election Commission
Election Commission : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు నిధుల విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల కోడ్ రాక ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైసీపీ ప్లాన్ వేసింది. దీనికి ఈసీ అభ్యంతరం తెలిపింది.
‘‘నిధుల జమ ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం చెప్పాలి. డీబీటీతో వెంటనే నగదు లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా ఎందుకు ఆలస్యమైంది? ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్ కు 2 రోజుల ముందు వేస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుంది’’ అని ఈసీ పేర్కొంది. ఎన్నికలు ముగిశాక ఆ నిధులను జమ చేయాలని, మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత దీనిపై మార్గదర్శకాలు ఇస్తామని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది.