Elderly People Vote : వయో వృద్ధులు తమ ఓటుహక్కు బాధ్యతను మరువకుండా ఓటువేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ఆ ఓటును వినియోగించుకోవడంలో ఇప్పటికీ కొందరిలో నిర్లిప్తత, నిర్లక్ష్యం కనిపిస్తోంది. అయితే, కొందరు వృద్ధులు మాత్రం వయో భారం కారణంగా శరీరం సహకరించక పోయినా ఓటింగ్ లో పాల్గొన్నారు. నాలుగో విడత ఎన్నికల్లో సోమవారం ఏపీ, తెలంగాణలో జరిగిన పోలింగ్ లో ఉత్సాహంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన చిదంబరరావు (97) తనకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నానని తెలిపారు. మండే ఎండలోనూ వీల్ చైర్ లో వెళ్లి ఆయన ఓటు వేశారు. గుంటూరులోని పెదవడ్లపూడికి చెందిన సీతారత్నం (86) తన స్వగ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వెన్ను నొప్పి కారణంగా నడవలేకున్నా వీల్ ఛైర్ లో వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన మల్లాది కృష్ణమూర్తి (96) స్థానిక బాల కుటీర్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సోదరుడు ఆలపాటి మాధవరావు (94) సోమవారం తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.