JAISW News Telugu

Eetala Rajender : లోక్ సభ బరిలో ఈటల.. సీఎం నియోజకవర్గంపై నజర్

Eetala Rajender

Eetala Rajender

Eetala Rajender Contest as MP : లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలోని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ఈ ఎన్నికల్లో గెలవడం ఎంతో కీలకం. అధికార కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా 10 సీట్లకు పైగా గెలుచుకోవాలని తహతహలాడుతోంది. మూడోసారి పక్కా అని అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడిన బీఆర్ఎస్ ..లోక్ సభలో సత్తా చాటి తన పూర్వవైభవాన్ని సాధించాలని భావిస్తోంది. మూడో సారి మోడీ లక్ష్యంగా బీజేపీ.. ఈ సారి తెలంగాణలో డబుల్ డిజిట్ పై ఆశలు పెట్టకుంది. పార్టీల పరిస్థితులు ఇలా ఉండగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా తమ రూట్ మారుస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఇప్పుడు ఎంపీ పదవి కోసం చూస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రధాన నేతలు అందరూ ఓడిపోయారు. అర్వింద్, బండి సంజయ్, రఘునందన్ రావుతో పాటు ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఈ నేతలందరూ ఇక లోక్ సభ సమరంలో ఢీకొట్టబోతున్నారు. వీరిలో సంజయ్, అర్వింద్ లు ఎంపీలుగానే ఉన్నారు. వారు తమ తమ స్థానాల నుంచే బరిలో ఉండబోతున్నారు. ఇక రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సైతం ఎంపీలుగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడంలో అనూహ్యంగా బీజేపీలో ఆయన పలుకుబడి పెరిగింది. కేంద్ర పెద్దలు కూడా ఆయన్ను ప్రశంసించారు. ఇక తనకు తిరుగులేదనుకున్నా.. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గంతో పాటు కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా గజ్వేల్ నుంచి సైతం పోటీ చేశారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ను ఓడించిన తనకు సీఎం పదవి వస్తుందని ఆయన బలంగా నమ్మారు. రెండు చోట్ల గెలిచి బీజేపీలో తానే బలమైన నేతను అని కేంద్ర పెద్దలకు చాటిచెప్పాలని అనుకున్నారు.  విధివశాత్తు ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.

మరో ఐదేండ్ల దాక జనాల్లో ఉండాలంటే యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో పట్టు పెంచుకోవాలన్న, కేంద్ర పెద్దల్లో మరింత పలుకుబడి సాధించుకోవాలన్న తక్షణం ఎన్నికల రాజకీయంలోకి దిగాల్సిందే. అందుకే ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి లేదా మెదక్ స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

కాగా, మల్కాజిగిరి నుంచి పి.మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్కా కొమురయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. దీంతో ఈటల రాజేందర్ మెదక్ ఎంపీ స్థానం వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మల్కాజిగిరి సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమని తెలిసిందే.  2018ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ లో గెలిచి సీఎం పదవిని చేపట్టారు.

మల్కాజిగిరిలో మూడు పార్టీలకు మంచి క్యాడర్ ఉంది. కాగా ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాబట్టి బీఆర్ఎస్ కు లాభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేటీఆర్ సైతం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొట్లాయి. దీంతో మల్కాజిగిరిలో ఎవరెవరూ పోటీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈక్రమంలో ఈటల రాజేందర్ మెదక్, మల్కాజిగిరి స్థానాలపై నజర్ వేశారు. ఈ రెండింటిలో పార్టీ పెద్దలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా ఆయన ఓకే చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన ఈటలకు లోక్ సభ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కానుంది.

Exit mobile version