MLA Mahipal Reddy : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అక్రమాస్తులపై ఈడీ ప్రకటన.. రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు

MLA Mahipal Reddy

MLA Mahipal Reddy

MLA Mahipal Reddy : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ జూన్ 20న సోదాలు నిర్వహించింది. సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. ఉదయం నుంచి మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆఫీసులు, ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. మహిపాల్‌రెడ్డి మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు జరిగాయి.

సంతోష్ స్యాండ్, సంతోష్‌ గ్రానైట్ కంపెనీల ద్వారా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. రూ.300 కోట్లలో మైనింగ్ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మహిపాల్‌రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది.

అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు, బ్యాంక్ అకౌంట్లలో అక్రమ లావాదేవీలు జరిపినట్లు తనిఖీల్లో తేలింది. మధుసూదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన కొన్ని బ్యాంక్ లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. మనీలాండరింగ్‌, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో లావాదేవీలనూ ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈడీ దాడులపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని ఆరోపించారు.

TAGS