MLA Nara Bharat Reddy : బళ్లారి, బెంగళూర్, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలతో సహా 13 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెల్లవారు జామున ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఆయన తండ్రి సూర్య నారాయణరెడ్డి, మేనమామ ప్రతాప్ రెడ్డి, బంధువు సతీశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.
మొత్తం 20 మంది ఈడీ అధికారులతో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు శనివారం తెల్లవారు జామున బళ్లారి చేరుకొని వారి ఇంటిలోకి వెళ్లి సోదాలు నిర్వహించాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) రక్షణలో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయి. బెంగళూర్ లో జరిగిన సోదాలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ శాసన సభ్యుడి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల్లో అక్రమంగా డబ్బు లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఈడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఎమ్మెల్యే భరత్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ఈడీ స్కానర్ కింద భూ లావాదేవీల ఆరోపణల ఆధారంగా తలెత్తింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని మైనింగ్, క్వారీ వ్యాపారాలపై కూడా విచారణ జరిగింది.
బళ్లారి సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా భరత్ రెడ్డి ఆస్తులు రూ.91.18 కోట్లుగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణను భరత్ రెడ్డి ఓడించారు.