MP Sanjeev Arora : ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోడా నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. భూ అక్రమాల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ లోని లూధియానాలో గల ఎంపీ నివాసం, కార్యాలయంతో పాటు ఇతర వ్యక్తుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈడీ సోదాలపై ఎంపీ సంజీవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ సోదాలకు గల కారణమేంటో నాకు తెలియదు. కానీ చట్టాన్ని అనుసరించే పౌరుడిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా ఇప్పటికే పలువురు ఆప్ నేతలు ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.