JAISW News Telugu

ED Charge Sheet : కవితపై ఈడీ చార్జిషీట్ లో షాకింగ్ విషయాలు.. ఉచ్చు బిగుసుకున్నట్టే..

ED Charge Sheet

ED Charge Sheet on Kavitha

ED Charge Sheet on Kavitha : కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ గతంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో పేర్కొంది. రూ.100 కోట్ల లంచాల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది.

సౌత్ గ్రూప్ లో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీశ్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్ నాయర్ తో కవిత పలుమార్లు సమావేశమయ్యారు. సమీర్ మహేంద్రు వాంగ్మూళం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్ కు అరుణ్ పిళ్లై వెల్లడించారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్ లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు.

అరుణ్ పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్ కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్ ఎల్ 1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు.  రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్ లో వాట ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్ నేతలకు మధ్య అవగాహన ఒప్పందం ఉందని అరుణ్ పిళ్లై తన వాంగ్మూళంలో పేర్కొన్నాడు.

ఆ సౌత్ గ్రూప్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, శరత్ రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్ గ్రూప్ నకు ప్రతినిధులుగా అభిషేక్ , అరుణ్, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. రూ.100 కోట్ల కిక్ బ్యాక్ లు బదిలీ చేయడానికి విజయ్ నాయర్, దినేశ్ అరోరాలతో కలిసి అభిషేక్ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది.

ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపింది. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్ట్ చేసినట్టుగా భావిస్తున్నారు.

Exit mobile version