భారతదేశ ఆర్ధిక వ్యవస్థ క్లిష్టపరిస్థితులలో ఉన్న సమయంలో ప్రధానిగా పదవి చేపట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు. ఆర్ధిక సంస్కరణలే దీనికి మందు అని గ్రహించి ధైర్యంగా ప్రవేశ పెట్టి దేశాన్ని గట్టెక్కించిన సంస్కరణాభిలాషి భారతరత్న పీవీ.అలాంటి పీవీకి భారతరత్న ప్రకటించడం ముదావహం.చంద్రశేఖర్ హయాంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని అమ్ముకునే దుస్థితి వచ్చింది. 1991లో పీవీ అధికారంలోకి రావడంతోనే ఆర్ధిక మంత్రిగా తీసుకున్న ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ సహకారంతో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాజీవ్ గాంధీ హత్యతో అనుకోకుండా ప్రధాని పదవికి దక్షిణాది రాజకీయవేత్త పీవీ రావడం దేశానికి మంచిదయింది.
పూర్తి బలం లేకపోయినా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తివారి,శరత్ పవార్, అర్జున్ సింగ్ వంటివారు వ్యతిరేకించి బయటకు వెళ్లినా ఐదేళ్లు అవిశ్వాసాలను అధిగమిస్తూ చివరివరకూ ప్రభుత్వాన్ని నడిపిన అపర చాణిక్యుడు పీవీ. ఈ ఐదేళ్లలో సంస్కరణలు అమలు చేసి రాజకీయ అస్థిరత్వం లోనూ ఆర్ధిక వ్యవస్థను సుస్థిరం చేసిన రాజనీతిజ్ఞుడు. ఈనాడు దేశం మాంద్యం నుంచి తట్టుకుని నిలబడిందంటే పీవీ పెట్టిన భిక్షే.నేడు ప్రపంచంలో కంటే భారత్లో ధనవంతుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నదంటే అది పీవీ ముందుచూపే. అమెరికా,చైనా వంటి దేశాలు ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా భారత్ ఆర్ధిక రేటు పెరుగుదల పైకి పోతోందంటే ఆనాడు ఆయన దూరదృష్టే కారణం.
ఇంతచేసిన ఆయన ను కాంగ్రెస్ నిర్లక్షం చేసింది. బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించడం ద్వారా దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకోవడమే అవుతుంది. దీనికి మోదీ ప్రభుత్వానికి అభినంధనలు. పీవీతో పాటు కిసాన్ మిత్రమాజీ ప్రధాని చరణ్ సింగ్ ,వ్యవసాయ శాస్త్రవేత్త యమ్మెస్ స్వామినాధన్ కు ప్రకటించడం ముదావహం.చరణ్ సింగ్ జనతా ప్రభుత్వంలో భాగస్వామి. స్వామినా ధన్ వ్యవసాయ సంస్కరణలకు ఆద్యుడు.ఆయన సంస్కరణలు భారత దేశం ఆహారఉత్పత్తిలో స్వయంసంవృద్ధి సాధించడంలో ఉపయోగపడ్డాయి.
వీరిద్దరికీ కూడా భారతరత్న ప్రకటించడం ఆనందదాయకమే. ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి భారతరత్న ప్రకటించింది.సోషలిష్ట్ కర్పూరీ ఠాకూర్, బీజేపీ ఆత్మ అద్వానీ,ఆర్ధిక సంస్కరణల ప్రదాత పీవీ, కిసాన్ మిత్ర చరణ్ సింగ్,వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న ప్రకటించడంతో కేంద్రం నిర్ణయం అందరూ మెచ్చేదే. 25ఏళ్లుగా పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పీవీకి భారతరత్న ప్రకటించడం తెలుగువారికి గర్వకారణం.కాని తెలుగు వీరుడు నేషనల్ ఫ్రంట్ నేత ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ప్రకటించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఉత్తరాది దక్షిణాది మధ్య రగులుతున్న వివాద సమయంలో పీవీకి భారతరత్న పన్నీరు కావాలని ఆశిద్దాం.